calender_icon.png 16 May, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ దౌత్య విజయం!

12-04-2025 12:00:00 AM

ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో తహవ్వుర్ హుస్సేన్ రాణా ఒకడు. ఈ నిందితుడ్ని దేశానికి రప్పించడానికి భారత్ దాదాపు 14 ఏళ్లపాటు న్యాయ, దౌత్య మార్గాల్లో సుదీర్ఘ పోరాటం చేసింది. ఈ పోరాటం ఊరికే పోలేదు. అతనిని పట్టుకొ చ్చి భారత్ అతిపెద్ద దౌత్య విజయాన్ని సాధించింది. ఇండియాకు చేరుకున్న వెంటనే అతనిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుని, పాటియాల హౌస్‌కోర్టులో హాజరుపర్చింది. విచారణకు 20 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. కోర్టు అతడ్ని 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి పంపింది.

ఇప్పుడు ఎన్‌ఐఏ అధికారులు ఉగ్రదాడి కుట్ర వివరాలను అతడ్నించి రాబట్టే పనిలో ఉన్నారు. ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీతోపాటు కోల్‌మన్ హెడ్లీ అనే స్నేహితుడితో కలిసి ముంబైపై దాడులకు కుట్ర పన్నిన కేసుల్లో రాణా నిందితుడు. అరేబియా సముద్రం ద్వారా భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ముంబై లోని తాజ్‌హోటల్, ఛత్రపతి శివాజీ టర్మినల్, మెట్రో సినిమా హాల్, లి యోఫాల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, సెయింట్ జేవియర్స్ కాలేజీ వంటి పలు ప్రదేశాల్లో దాడులకు తెగబడ్డారు. ఆనాడు ఆ ఉగ్రమూక సృష్టించిన నరమేధంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 238 మంది గాయపడ్డారు. ఉగ్రదాడి జరగడానికి కొన్ని రోజులముందు కేరళ, ఉత్తరప్రదేశ్, హాపుర్, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై ప్రాంతాల్లో రాణా పర్యటిం చాడు.

రాణా జన్మతః పాకిస్థాన్ పౌరుడు. 1990లో రాణా కెనడాకు వలస వెళ్లి ఆ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. తర్వాత అక్కడ్నించి అమెరికా వెళ్లి, షికాగోలో ఇమ్మిగ్రేషన్ కన్సెల్టెన్సీ తెరిచాడు. ఈ సంస్థద్వారా ముంబైలో హెడ్లీ గూఢచర్యం చేయడానికి రాణా సహకరించాడు. హెడ్లీ ఇచ్చిన సమాచారంతోనే ఉగ్రవాదులు తమ లక్ష్యాలను ఎంచుకున్నారు. ఆ ఉగ్రదాడిలో రాణా ప్రధాన పాత్ర పోషించినట్టు ఎన్‌ఐఏ తమ దర్యాప్తులో గుర్తించి, ఆ సమాచారాన్ని ఎఫ్‌బీఐకి చేరవేయడంతో అతడ్ని అమెరికాలో అధికారు లు అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడులతో రాణాకు లింకులు ఉన్నట్టు అమెరికా న్యాయశాఖ కూడా గుర్తించింది. దాడి తర్వాత ‘దీనికి భారతీయులు అర్హులు’ అని హెడ్లీతో రాణా పేర్కొన్నట్టు తన నివేదికలో పేర్కొం ది. ‘ఈ దాడుల్లో పాలుపంచుకున్న 9 మంది ఎల్‌ఈటీ ఉగ్రవాదులకు పాకిస్థాన్ అత్యున్నత సైనిక పురస్కారమైన నిషాన్ హైదర్ ఇవ్వాలి’ అని హెడ్లీతో సంభాషణ సందర్భంగా రాణా అభిప్రాయపడ్డాడు. దీనిద్వా రా దాడులతో రాణాకు సంబంధం ఉందని స్పష్టమవుతున్నది. భారత్ అమెరికాల మధ్య నేరస్థుల అప్పగింతపై ఒప్పందం ఉండటం వల్ల రా ణాను అమెరికా కస్టడీలోకి తీసుకుని భారత్‌కు అప్పగించింది.

ఈ తరుణంలో రాణాకు తమ దేశంతో ఎటువంటి సంబంధం లేదని పాకిస్థాన్ చెబుతున్నది. రాణా తమ దేశంలోనే పుట్టినప్పటికీ కెనడా పౌరసత్వాన్ని తీసుకోవడంతో పాక్ పౌరసత్వాన్ని కోల్పోయాడని వాదిస్తోంది. అయితే, కెనడాకు వెళ్లక ముందు అతడు పాకిస్థాన్ ఆర్మీలో కొన్నాళ్లు సేవలందించాడు. ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగంతోనూ అతడికి లింకులున్నాయి. వీట న్నిటినీ పరిశీలిస్తే ముంబై దాడుల వెనక పాకిస్థాన్ హస్తం ఉందనే వాదనకు బలం చేకూరుతోంది. దాడి విషయంలో పాకిస్థాన్, రాణాకు మధ్య ఉన్న సంబంధం ఎన్‌ఐఏ విచారణలో బయటకు రావాల్సి ఉంది.