24-07-2025 08:22:28 AM
జర్నలిస్టులకు అండగా ఉంటా...
ప్రతి ఒక్క జర్నలిస్టుకు సొంతిల్లు..
ప్రమాద బీమా.. ప్రెస్ క్లబ్ ఏర్పాటు..
ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, (విజయక్రాంతి): సమాజంలో జర్నలిస్టులకు, జర్నలిజానికి(Journalism) ఎంతో గౌరవం ఉందని, విలువలతో కూడిన జర్నలిజం నేటి సమాజానికి అవసరమని ఒక్క జర్నలిస్టు తప్పు చేసిన జర్నలిజానికే అది మచ్చలా మారుతుందని జర్నలిస్టులు నిజా నిజాలను ఎత్తిచూపుతూ నిక్కచ్చి వార్తలు రాయాలని, జర్నలిజం విలువలు కాపాడేందుకు ప్రతి జర్నలిస్టు కృషి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా చిట్యాల రోడ్డులోనీ ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐ జె యు ) తృతీయ మహాసభలకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కొందరు జర్నలిస్టులు నాయకుల గుర్తింపు కోసం వెంపర్లాడతారని జర్నలిజం అనేది పార్టీలకతీతంగా పనిచేస్తూ నిజాలను నిర్భయంగా రాయాలన్నారు.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గురించి ఎవ్వరు కూడా ఆహా ఓహో వార్తలు రాయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పథకాల మంచిని మంచిగా చెడును చెడుగా రాస్తే చాలు అన్నారు. వ్యక్తులపై ఉన్న వేదాభిప్రాయాలను వ్యక్తిగతంగానే ఉండనివ్వలని జర్నలిజన్లో వ్యక్తిగత వ్యత్యాసాలకు తావివ్వకుండా వార్తలు రాస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసేలా వార్తలుండాలని ఆయన కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టారని జర్నలిజానికి రాష్ట్ర సర్కార్ పూర్తిస్థాయి గుర్తింపునిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గం లోని జర్నలిస్టులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వటం తో పాటు ఇంటి నిర్మాణాలు చేపడతామన్నారు.
ప్రతి జర్నలిస్టుకు ప్రమాద బీమా సౌకర్యం ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయిస్తామన్నారు వనపర్తి నియోజకవర్గం గత 60 ఏళ్ల నుంచి అభివృద్ధిలో ముందుందని ఆయన అన్నారు. రాజావారి కాలంలోనే వనపర్తి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఉండేదని, ఆ కాలంలోనే అన్నదాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సప్త సముద్రలు నిర్మించిన చరిత్ర వనపర్తి నియోజకవర్గంకు ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో ఈ మహాసభలు నిర్వహించి ముఖ్యఅతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్అలీని అభినందిస్తూ ఆయన సన్మానించారు. తాను పదవిలో ఉన్నంతకాలం జర్నలిస్టులకు అండగా ఉంటానని ఎక్కడ ఏ సమస్య ఉన్న మండలాల వారిగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి మండలంలోనూ జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు జిల్లాలోని ఆయా మండలాల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.