11-04-2025 12:00:00 AM
డాక్టర్ తిరుణహరి శేషు :
* ఇప్పటికే మహారాష్ట్ర శాసనసభ ఫూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది కూడా. ఈ తరుణంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ శాసనసభల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి.
కొందరు మహనీయులు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు సమాజానికి చేసిన సేవలు, పోరాటం భవిష్యత్తు తరాల వారిలో స్ఫూ ర్తిని నింపుతూనే ఉంటుంది. ఇలా భౌతికంగా వారు లేకున్నా ప్రజలమధ్య వాళ్లు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటారు. అటువం టి మహనీయుల్లో భారతదేశపు ప్రముఖ సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే ఒకరు. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారాలో వెనుకబడిన వర్గాలకు చెందిన గోవిందరావ్, చిమనాభాయ్ దంపతులకు ఫూలే జన్మించారు.
సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు, కులాల పట్టింపులను బలంగా విశ్వసించే వ్యవస్థలో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఫూలే పోరాడా రు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజ ల అణచివేతకు వ్యతిరేకంగా వారి హక్కు లు, స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావుడాయన.
నల్ల జాతీయలు బానిసత్వ నిర్మూలన కోసం అమెరికాలో అబ్రహాం లింకన్ అనే క పోరాటాలు చేశారు. వారి హక్కుల కోసం లింకన్ చేసిన పోరాటాలు జ్యోతిబా ఫూలేను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సమాజంలోని దోపిడీలు, అసమానతలు, మూఢ నమ్మకాలు, సామాజిక కట్టుబాట్లు, కులం, వర్గ వ్యవస్థలకు ప్రధాన కారణం నిరక్షరాస్యతే.
ఆనాడు సమాజంలో జరిగే అన్ని అనర్థాలకు మూలం విద్య లేకపోవడమే అని జ్యోతిబా ఫూలే బలంగా విశ్వ సించారు. సామాజిక సమానత్వ సాధనకు సంస్కరణల ఉద్యమాన్ని మొదలుపెట్టా రు. ఈ ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి ప్రయత్నంగా అప్పటి వరకు విద్యకు దూరంగా నెట్టివేతకు గురైన స్త్రీలు (బాలికలు), నిమ్నవర్గాలకు చెందిన శూద్రులు, అతిశూద్రుల కోసం పాఠశాలలను ఏర్పాటుచేశారు.
1848లో పుణెలోని బడేవాడ లో మొట్టమొదట బాలికల పాఠశాలను, 1852లో అంటరాని కులాల వారి కోసం మరొక పాఠశాలను ఏర్పాటు చేయటాన్ని ఒక విప్లవంగా భావించాలి. విద్యద్వారానే బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని, సమానత్వం పెంపొందుతుందని భావించారు.ఆ మేరకు అణగారిన వర్గాల్లో విద్యా వ్యాప్తి కోసం జ్యోతిబా ఫూలే తన భార్య సావిత్రిబాయి ఫూలే సహకారంతో అనేక చోట్ల పాఠశాలలను ఏర్పాటు చేశారు.
అలుపెరగని పోరాటం
దేశంలో సామాజిక సమస్యలపై ఉద్యమించిన తొలి తరం సామాజిక సంస్కరణ వాది జ్యోతిబా ఫూలే. కులవ్యవస్థ, అంటరానితనం, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు, మూఢ నమ్మకాలు, సతీ సహగమనం, మద్యపానం వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. స్త్రీల హక్కుల కోసం ముఖ్యం గా వితంతువుల రక్షణ, రైతు, కార్మిక సమస్యలపై ఫూలే అసాధారణ పోరాటాన్ని సాగించారు.
వాటి నిర్మూలన ద్వారానే స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం సాధ్యమవుతుందని ఆయన గట్టిగా నమ్మారు. అసమానతలు లేని ప్రపంచం మొత్తం ఒక కుటుంబంగా మారాలనే ఉద్దేశంతో సార్వజనిక సత్యధర్మాన్ని ప్రతిపాదించారు. ఇలా ఒక గొప్ప మానవతావాదిగా చరిత్రలో నిలిచి పోయారాయన. అయితే, నాడు ఏ సామాజిక సమస్యలపై ఫూలే ఉద్యమాన్ని మొదలుపెట్టారో ప్రస్తుతం కూడా సమాజ పురోగతికి అవే సామాజిక సమస్యలు అడ్డు తగులుతున్నాయి.
సామాజిక సమానత్వం కోసమే మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే దంపతులు ఉద్యమించారు. స్త్రీలకు హక్కులు కల్పించటం ద్వారా లింగ సమానత్వం, అంటరానితనం నిర్మూలనతో సామాజిక సమాన త్వం సాధించడానికి వారు కృషి సలిపా రు. సంఘ ఉద్యమాలకు, సంస్కరణలకు విస్తృత ప్రచారం, బలం చేకూర్చటానికి 1873లో సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేశారు. ఆయన చేసిన గులాంగిరి వంటి రచనలు సామాజికోద్ధరణకు ఎంతగానో తోడ్పడ్డాయి.
సమానత్వ సాధనే లక్ష్యంగా..
ఫూలే భావనల ప్రకారం దేవునికన్నా మానవహక్కులు గొప్పవి. ఏకకాలంలో 1817 మధ్య ప్రతిపాదించిన మార్క్స్ వర్గ రహిత సమాజం, ఫూలే కులరహిత సమాజ ఉద్యమాల లక్ష్యం ఒక్కటే కావడం గమనార్హం. ‘సమాజంలోని అన్ని అనర్థాలకు మూలం వర్గ వ్యవస్థే’ అని మా ర్క్స్ నిర్ధారిస్తే, అన్ని ‘సమస్యలకూ ప్రధాన కారణం కులమే’ అని ఫూలే భావించారు. 1848లో కమ్యూనిస్టు మేనిఫెస్టో పెట్టుబడిదారులను దోపిడి వర్గంగా పేర్కొంది.
జ్యోతిబా ఫూలే స్థాపించిన ‘సత్యశోధక్’ సమాజం మాత్రం చాతుర్వర్ణ వ్యవస్థలోని బ్రాహ్మణ వర్గాన్ని దోపిడీ వర్గంగానే భావించింది. దీనిద్వారా మార్క్స్‌కంటే ఫూలే వారిది మరింత లోతైన భావజాలంగా పరిగణించాలి. సామాజిక తిరోగ మన కట్టుబాట్ల నుంచి అట్టడుగు వర్గాలైన శూద్రులు, అతిశూద్రులు, స్త్రీలకు స్వేచ్ఛను కల్పించడంతోపాటు సమాజ విభజనకు కారణమైన కులవ్యవస్థను నిర్మూలించి సమానత్వాన్ని సాధించడమే ఆయన సంస్కరణల లక్ష్యం.
మహోన్నత సేవకు ప్రతిరూపం
పాఠశాలలు, అనాథ శరణాలయాలు, శిశు హత్యా ప్రబంధక గృహాలు, వైద్యశాలల ఏర్పాటు వంటివాటి ద్వారా సమా జంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు ఫూలే దంపతులు చేసిన సేవలు అజరామరం. వారి కృషి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మహిళా సాధికారత కోసం, సామాజిక కట్టుబాట్లతో అణచివేతకు గురై న అణగారిన వర్గాల హక్కుల కోసం ఈ దంపతులు చేసిన పోరాటాలు నేటి తరానికి మార్గదర్శకం.
ఆయనను ఆచరణాత్మక ఆదర్శవాదిగా భావించాలి. 1890లో జ్యోతిబా ఫూలే మరణించినా ఆయన ఆదర్శాలను సావిత్రీ బాయి ఫూలే ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే 1896లో పుణెలో ప్లేగువ్యాధి బారిన పడిన వారికి ఆమె అనితర సేవలు అందించారు. ఆ కృషిలో కొనసాగుతూనే చివరికి ఆమె కూడా అదే వ్యాధితోనే మరణించడం దురదృష్టం. ఈ రకంగా ఫూలే దంపతులు మానవ సేవకు ప్రతిరూపాలు నిలిచారు.
సేవకు ప్రతిరూపం ఫూలే దంపతులు. సార్వజనిక సత్యధర్మాన్ని ప్రతిపాదించారు. అణిచివేతకు గురైన వారి పక్షాన ఉద్యమించారు. ఈ కారణంగా వారిని దేశ అత్యు న్నత పురస్కారమైన భారతరత్న అవార్డు తో సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1954 నుంచి భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది.
రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సైన్స్, పరిశోధన, వినోదం వంటి పలు రంగాల్లో విశేషంగా కృషి చేసిన 53 మంది మహనీయులను ప్రభుత్వం భారతరత్న అవార్డుతో గౌరవించింది. విశిష్టసేవలు అందజేసిన మదర్ థెరిసా, నెల్సన్ మండే లా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లాంటి విదేశీయుల సేవలను కూడా గుర్తించి ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.
‘భారతరత్న’తో గౌరవించుకుందాం!
భారతదేశంలో సామాజిక సంస్కరణల ఉద్యమానికి పునాదులు వేసిన ఫూలే దం పతలకూ భారతరత్న అవార్డు ఇవ్వడం పూర్తి సముచితంగా ఉంటుంది. వారి జీవితకాల సేవలకు మనమిచ్చే సమున్నత గౌరవంగానే దీనిని భావించాలి. ఇప్పటికే మహారాష్ట్ర శాసనసభ ఫూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది కూడా.
ఈ తరుణంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ శాసనసభల్లో తీర్మానాలు చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ముందు వరుసలో నిలబడాలి. జ్యోతిబా ఫూలే సేవలకు గుర్తింపుగానే ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అని పిలుస్తున్నారు. ఈ రకం గా ఆ దంపతుల గొప్పతనాన్ని దేశం గుర్తించవలసి ఉంది.
వ్యాసకర్త సెల్: 9885465877