24-07-2025 08:19:09 AM
నాగార్జునసాగర్,విజయక్రాంతి: ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. పైనుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యామ్ నుంచి కృష్ణా నదిలో వరద నీరు తరలుతుండగా, జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉరకలు వేస్తూ శబ్దాలతో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలానికి ఒక లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు ప్రవేశించగా, ప్రాజెక్టు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు(Nagarjunasagar) 121711 క్యూసెక్కుల కంటే అధికంగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 881.60 అడుగులకు చేరుకుంది. మొత్తం 215.807 టీఎంసీల నిల్వ సామర్థ్యంలో, 196.561 టీఎంసుల నీరు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆయకట్టు రైతుల్లో ఆనందం
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువన కృష్ణ బేసిన్ లో వర్షాలు ముందస్తుగా కురవడంతో గత ఐదు సంవత్సరాల నుండి ఎన్నడు లేని విధంగా జూలై మొదటి వారంలో నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద మొదలైనట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం భారీగా వచ్చే అవకాశముందని ఎడమ కాలువ ఆయకట్టు రైతుల ఆశలు చిగురించి, కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. నార్లు పోయడం,దుక్కులు దున్నడం లాంటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఇప్పటికే బోర్లు,బావుల ఆధారంతో కొంత మంది రైతులు నాట్లు వేసే క్రమంలో ఉన్నారు. సాగర్ జలాశయానికి ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతంలో రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
పది లక్షల ఎకరాల సాగు
ఎడమకాలువ పది లక్షల ఎకరాల సాగు తెలంగాణ, ఏపీలో కలిపి సాగర్ ఎడమకాలువ ఆయకట్టు సాగు విస్తీర్ణం 1 0.37 లక్షల ఎకరాలు. దీంట్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో 6.62 లక్షల ఎకరాల పారకం ఉంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలిపి మరో 3.75 లక్షల ఎకరాలు సాగవుతోంది.
ఐదేళ్లుగా సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల ఇలా
సంవత్సరం సాగర్ నీటి విడుదల తేదీ నాటి నీటి మట్టం 2018-19 24-08-2018- 562 అడుగులు (238.47టీఎంసీలు)
2019-20 12-08-2019- 556 అడుగులు (223.19టీఎంసీలు)
2020-21 08-08-2020- 587 అడుగులు (305.62టీఎంసీలు)
2021-22 02-08-2021- 587 అడుగులు (305.62 టీఎంసీలు) 2022-23 29-07-2022- 552 అడుగులు (215.98 టీఎంసీలు)
సాగర్ నీటిమట్టం
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం575. అడుగులు కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం.. 312.50 టిఎంసిలు కాగా..
ప్రస్తుత నీటి నిల్వ : 267 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇన్ ఫ్లో :121711.క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 5685 ..క్యూసెకులుగా కొనసాగుతుంది.