calender_icon.png 6 October, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేనిఇళ్లకు.. ఇంటి నంబర్లు!

06-10-2025 12:29:09 AM

-అల్వాల్‌లో రూ.180 కోట్ల విలువైన 9 ఎకరాల స్థలం కబ్జాకు అక్రమార్కుల యత్నం

-కబ్జాదారులకు జీహెచ్‌ఎంసీ అధికారుల అండ?

- లేని 80 ఇళ్లకు ఇంటి నంబర్లు మంజూరు

-భూ యజమాని ఫిర్యాదుతో బట్టబయలైన బాగోతం

-విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశం

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఖాళీ స్థలంలో, కట్టని 80 ఇళ్లకు ఇంటి నంబర్లను కేటాయించి, వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేయాలని చూసిన భారీ కుంభకోణం మేడ్చ ల్-మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌లో వెలుగుచూసింది. జీహెచ్‌ఎంసీ అధికారుల అండతో కొందరు అక్రమార్కులు ఈ బాగోతానికి తెరలేపారు.

భూయజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్... అక్రమంగా జారీ చేసిన 80 ఇంటి నంబర్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఈ వ్యవహారంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే, ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన దోషులు, పైస్థాయిలో పైరవీలు చేస్తూ విచారణను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్ 573లో 3.24 ఎకరాలు, సర్వే నంబర్ 574లో 5 ఎకరాల భూమిని నిమ్మ మోహన్‌రెడ్డి అనే వ్యక్తి 2003, 2004 సంవత్స రాల్లో చట్టబద్ధంగా కొనుగోలు చేశారు.

అప్పటి నుంచి ఆ భూమి ఆయన స్వాధీనంలోనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక రా భూమి విలువ రూ.50 కోట్ల వరకు పలుకుతుండటంతో.. మొత్త ఆ భూమి విలువ సుమారు రూ.180 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిపై కొందరు పెద్దల కన్ను పడింది. ఈ క్రమంలో మామిడి జనార్దన్‌రెడ్డి అనే వ్య క్తిని రంగంలోకిదించి, సర్వే నంబర్లు 573/2, 574/2లలో అతనికి 3.30 ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. అంగ, అర్థబలంతో పలుమార్లు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా, యజమాని మోహన్‌రెడ్డి వారిని అడ్డుకున్నారు.

ఆన్‌లైన్ విధానాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ సెల్ఫ్ అసెస్‌మెంట్ విధానాన్ని ఆసరాగా చేసుకున్న జనార్దన్‌రెడ్డి, కొందరు జీహెచ్‌ఎంసీ సర్కిల్ అధికారులను ప్రలోభపెట్టాడు. సృష్టించిన నకిలీ పత్రాలతో ఏకంగా 9 ఎకరాల ఖాళీ స్థలానికి ఇంటి నంబర్లు సంపాదించాడు. ప్రతి 400 గజాల చొప్పున 10 ప్లాట్లకు కలిపి ఒకే ఇంటి నంబర్ చొప్పున, మొత్తం 80 ఇంటి నంబర్లను పొందాడు. ఈ నంబర్ల ఆధారంగా ప్లాట్లను అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భారీ స్కెచ్ వేశాడు.

ఈ కుట్రను పసిగట్టిన భూ యజమాని మోహన్‌రెడ్డి.. ఆధారాలతో సహా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కమిషనర్, కేటాయించిన 80 ఇంటి నంబర్లను రద్దు చేసి, ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, నిందితులు రాష్ర్ట సచివాలయ స్థాయిలో పైరవీలు చేస్తూ విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.