06-10-2025 01:13:03 AM
నిత్య ప్రయాణికుడిపై నెలకు రూ.500 భారం
జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు చర్య
రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : హైదరాబాద్ జంట నగరా ల్లో సిటీ బస్సు చార్జీల పెంపు దుర్మార్గమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కనీస చార్జీని ఏకంగా రూ.10కి పెంచాలనుకోవడం పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేందుకే కాంగ్రెస్ ప్రభు త్వం పన్నిన కుట్ర అని విమర్శించారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో రాష్ర్ట ప్రజలు అల్లాడుతున్న తరుణం లో ఈ చార్జీల పెంపు పిడుగులాంటిదని తెలిపారు. నిత్య ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం మోపితే, బడుగుజీవులు, దినసరి కూలీలు ఎలా బతకాలని సీఎంను ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు, టీ-24 టికెట్ చార్జీలను పెంచింది చాలదన్నట్టు, ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతం ధరలను పెంచడం రేవంత్ రెడ్డి అసమర్థ, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధానివాసుల నడ్డివిరిచేలా ప్రతి నిత్యం దాదాపు కోటి రూపాయల భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రికి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారనే కసితోనే రేవంత్ రెడ్డి ఈ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.
తుస్సుమన్న ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ సంస్థను దివాలా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిదని విమర్శించారు. ఈ అసమర్థ పాలన వలన రాష్ర్ట ప్రగతి రథచక్రాలే కాదు, చివరికి ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు సైతం ధ్వంసం అయిన పాపం రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ సర్కారును కుప్పకూల్చే వరకూ వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.