06-10-2025 01:15:36 AM
-జూబ్లీహిల్స్ బరిలో దిగేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం
-ఆ నలుగురి పేర్లతో జాబితా సిద్ధం!
-లిస్టులో నవీన్ యాదవ్, అంజన్‌కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి
-తుది నిర్ణయం కోసం అధిష్ఠానానికి పంపిన రాష్ర్ట నాయకత్వం
-రేసులోకి మళ్లీ అజారుద్దీన్!
-ఢిల్లీలో తేలనున్న అభ్యర్థి
-ఎంపికపై అధిష్ఠానం నుంచి తుది నిర్ణయం?
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిని ఖరారు చేయడం అధికార కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, ముఖ్య నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో నలుగురు బలమైన నేతలు పీసీసీ ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లతో రాష్ర్ట నాయకత్వం జాబితాను సిద్ధం చేసి, తుది నిర్ణయం కోసం అధిష్ఠానానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎమ్మెల్సీ హామీతో రేసు నుంచి తప్పుకున్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
నలుగురు బీసీ నేతల పేరు ఖరారు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం ముగ్గురు బలమైన బీసీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మేయర్‌గా పనిచేసి కాంగ్రెస్‌లో చేరిన బొంతు రామ్మోహన్‌తో పాటు, స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రులను ఆశావహులపై నివేదిక కోరారు. తాజాగా, రాష్ర్ట నాయకత్వం నలుగురు పేర్లతో ఒక జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో పై నలుగురి పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాను అధిష్ఠానానికి పంపనుండగా, ఏఐసీసీ తుది పరిశీలన జరిపి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుంది.
అజారుద్దీన్ పునరాగమనంతో కొత్త ట్విస్ట్
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అజారుద్దీన్‌కు ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. దీంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే గవర్నర్ కోటాలో రాజకీయ నేపథ్యం ఉన్నవారిని ఎమ్మెల్సీగా నియమించడంపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అజారుద్దీన్ వర్గంలో ఆందోళన మొదలైంది.
గతంలో ఎంపీగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం ఉండటంతో గవర్నర్ కోటాలో అవకాశం దక్కకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని మైనారిటీ నేతలు, ఆయన అనుచరులు అజారుద్దీన్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే హైదరాబాద్ కోటాతో పాటు మైనారిటీ కోటాలో మంత్రి పదవి దక్కించుకోవచ్చని అజార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మనసు మార్చుకుని, మళ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
అభ్యర్థి ఎవరో తేలేది ఢిల్లీలోనే!
ఈ పరిణామాల మధ్య ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు గురించి సీనియర్ న్యాయవాదులతో చర్చించేందుకు వెళ్తున్నప్పటికీ, ఈ పర్యటనలోనే జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానంతో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించడంతో, ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.