14 July, 2026 | 3:35 AM

బీటీరోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అడ్డంకి!

14-07-2026 12:03 AM
  1. పెదవీడు -లాలితండ మధ్య అర్ధాంతరంగా ఆగిన పనులు 
  2. అధికారులు జోక్యం చేసుకొని సమస్య పరిష్కారించాలి

మఠంపల్లి, జూలై 13 : ప్రజలు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదన్న సంకల్పంతో ప్రభుత్వాలు రోడ్డు మార్గాలని ఏర్పాటు చేస్తుంటాయి. అయితే ఈ పనులకు ఏదో ఒక ఆటంకాలు కలుపుతుండ డం తో అక్కడక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరగక ప్రజలు అనేక ఇబ్బందులకు గురికావా ల్సి వస్తుంది. సరిగ్గా ఇదే పరిస్థితిమం డలం లోని పెదవీడు- లాలితండా రోడ్డుకు నెలకుంది.

అటవీశాఖ అడ్డంకితో నిలిచిన పనులు 

పెదవీడు లాలితండా గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న బిటి రోడ్డు పనులు అటవీ శాఖ అధికారులు అడ్డగించడంతో అర్థాంతంగా ఆగిపోయాయి. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మండలంలోని పెదవీడులాలితండా బీటీ రోడ్డు నిర్మాణ పరిస్థితి అగమ్యగోచారంగా తయారైంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం పెదవీడు నుంచి లాలి తండా వరకు 3.6 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణానికి రూ.2.24 కోట్ల నిధులను మంజూరు చేసింది.

టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను నెలల తరబడి మందకొడిగా కొనసాగించడంతో రహదారి నిర్మాణం ఆలస్యమైంది. ఇదే సమయంలో లాలి తండా సమీపంలోని 0.8 కిలోమీటర్ల రహదారి అటవీ శాఖ పరిధిలోకి రావడంతో అవసరమైన అనుమతులు లేవని అటవీ అధికారులు పనులను అడ్డుకున్నారు. దీంతో రహదారి నిర్మాణం అంత మేరకు నిలిచిపోయింది.

చినుకు పడితే రోడ్డు బురదమయం

ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో రహదారి బురదమయంగా మారడంతో అటు వైపుగా రాకపోకలు సాగించే ప్రజలు,రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కోట్ల రూపాయల నిధులు మంజూరైనా పనులు సకాలంలో పూర్తి కాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా పెదవీడు నుంచి అవిరేనికుంట తండా,కొత్త దొనబండ తండా నుంచి అవిరేనికుంట తండా వరకు బిటి రోడ్డు పనులు మొదలు పెట్టారు, నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రైతులు పొలాలకు వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అటవీ శాఖ అనుమతుల సమస్యను పరిష్కరించి, రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అటవీ శాఖ అధికారుల అనుమతి రావాలి

పెదవీడు నుంచి లాలితండా వరకు బిటి రోడ్డు పనులు విషయంలో అటవీ శాఖ అధికారుల అనుమతి రావాల్సి ఉంది, అనుమతి వచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాము

శివకుమార్, ఆర్ అండ్ బి ఏఈ

ఉన్నత అధికారులు జోక్యం చేసుకోవాలి

అటవీ శాఖ అధికారులు అడ్డగించడంతో అర్థాంతంగా ఆగిపోయాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన వానలు కురిసినప్పుడు రోడ్లపై ఉన్న గుంతల్లో నీళ్లు ఆగి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కావున ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని  అటవీశాఖ అధికారుల నుండి అనుమతి వచ్చేలా చేసి సమస్యలను పరిష్కరించాలి

భూక్యా బాలు నాయక్, రైతు