లఢక్‌లో 5 కొత్త జిల్లాల ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం కోసమే అన్న అమిత్ షా
న్యూఢిల్లీ, ఆగస్టు 26: కేంద్రపాలిత ప్రాంతం లఢక్‌కు సంబంధించి ఎన్‌డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లఢక్‌లో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నటు కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్‌షా సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం లఢక్‌లో కేవలం రెండు జిల్లాలు (లేహ్, కార్గిల్) ఉండగా కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలతో కలిపి జిల్లాల సంఖ్య 7 కు చేరుకోనుంది. కొత్త జిల్లాల వివరాలు. 1.జన్‌స్కర్, 2.ద్రాస్, 3. షామ్, 4. నుబ్రా, 5. చాంగ్‌థాంగ్.
ప్రతి ఇంటికి పథకాలు అందాలి
లఢక్‌లోని ప్రతి ఇంటికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని అమిత్‌షా స్పష్టం చేశారు. కొత్త జిల్లాలతో పాలన, సేవలు సామన్య ప్రజలకు మరింత చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన అవకాశాలు, సేవలు అందుతాయి. లఢక్ ప్రజలకు అభినందనలు’ అని అన్నారు.






