26 July, 2026 | 1:10 AM

మాజీ మంత్రి శివశంకర్ భార్య మృతి

31-05-2024 01:22 AM

ఒడిశా తొలి మహిళా గ్రాడ్యుయేట్‌గా డాక్టర్ లక్ష్మీబాయి రికార్డు

90 ఏళ్ల వయసులో రెండు పీహెచ్‌డీలు చేశారు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (విజయక్రాంతి): కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ పుంజాల శివశంకర్ సతీమణి డాక్టర్ లక్ష్మీబాయి (94) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. లక్ష్మీ బాయి తల్లిదండ్రులది విశాఖపట్నం జిల్లా యలమంచలి కాగా వారి కుటుంబం ఒడిశాలోని జైపూర్ నగరంలో స్థిరపడింది. లక్ష్మీబాయి ఒడిశాలో తొలి మహిళా గ్రాడ్యుయేట్‌గా గుర్తింపు పొందారు. ఉత్కల్ యూనివర్సిటీలో బీఏ అభ్యసించిన లక్ష్మీబాయి ఆ తర్వాత హిందూ విశ్వవిద్యాల యంలో ఎంఏ పూర్తి చేశారు.

చదువుపై మక్కువతో 80, 90 యేండ్ల వయసులో కూడా ఆమె రెండు పీహెచ్‌డీలు చేశారు. డీ.లిట్ పూర్తిచేసి 87యేండ్ల వయసులో బంగారు పతకాన్ని సాధించారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. భగవద్గీత  ఆధునిక మానవుడికి దాని ఔచిత్యం అనే అంశంపై ఇద్దరు పీహెచ్‌డీ చేయగా ఆ థీసిస్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి సమర్పించిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

80 యేండ్ల వయసులో ఆమె దాదా పు ఐదు వేల పేజీలు రాశారు. తన భర్త శివశంకర్ కేంద్ర విదేశాంగ మంత్రిగా, సిక్కిం, కేరళ గవర్నర్‌గా పనిచేసే సమయంలో ఆమె ప్రముఖ హోస్ట్‌గా ప్రసిద్ధిగాంచారు. కాగా ఆమె భర్త శివశంకర్ 2017లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రఖ్యాత వయోలిన్ వాద్యకారుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మేనకోడలు. 

దత్తాత్రేయ సంతాపం

లక్ష్మీబాయి మృతి పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. లక్ష్మీబాయి ఓ పక్క తన భర్తకు సేవలందిస్తూనే, కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నత చదువులు చదివారని కొనియాడారు. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిం చారన్నారు. ఆమె తనకు అత్యంత ఆత్మీయురాలని చెప్పారు.  తాను అలైబలైకి ఆహ్వానిం చిన వెంటనే విచ్చేసి సన్మానాన్ని స్వీకరించిన ఉత్తమ మహిళ అని అభివర్ణించారు.