28 March, 2026 | 12:06 AM

తల నరుక్కుంట కానీ మాట తప్పను..!

27-03-2026 10:00 PM

- అనుకూలంగా ఉంటే అందలం.. లేదంటే జైలు కూడు తినిపిస్తా

- గతంలో చేసిన తప్పేంటో తెలుసుకున్న

- వెన్నుపోటు దారులు కనుమరుగయ్యారు

- అధికారంలో లేకున్నా మీరు చూపే ఆధారాభిమనాలతో ఇంటి మనిషి లెక్క పనిచేస్తా

- కాంగ్రెస్ పార్టీ తోత్తులుగా పోలీసులు

- భయపడితే తెలంగాణ సాధించేటోళ్ళామా 

- జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాట్ కామెంట్స్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పదేళ్లపాటు తన వెన్నంటే ఉంటూ అధికారాలు, రాజభోగాలనుభవిస్తూ తీరా ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే పార్టీ మారిన నేతలను గుర్తుంచుకున్నానని ప్రస్తుతం తన వద్ద అధికారం లేకపోయినా తన పైన చూపుతున్న ప్రేమ అనురాగాలు అభిమానంతో ఉన్న కార్యకర్తలే నికార్సైన వారంటూ వారిని ఇంటి మనిషి లెక్క చూసుకుంటానన్నారు. మాట ఇస్తే తల నరుక్కుంటా కానీ మాట తప్పను అంటూ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.

శుక్రవారం శ్రీరామ నవమి రోజునే తన జన్మదినం సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తిమ్మాజిపేట, బిజినపల్లి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాడు కూడా ఇంతగా సంబరపడలేదని తన వద్ద ప్రస్తుతం అధికారం లేకపోయినా స్వచ్ఛందంగా ఊరూరా బ్యానర్లు, కటౌట్లు కేక్ కట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారని సినిమాల్లో నటించే హీరోల కంటే తనపై చూపే ఈ ప్రేమ అనురాగాలు ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు.

తన నుండి పదవులు అనుభవించి ఆర్థికంగా ఎదిగిన వారే సరిగ్గా ఎన్నికల టైంలో వెన్నుపోటు పొడిచారని అలాంటివారు ప్రస్తుతం కనుమరుగయ్యారని చురకలంటించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంత మందిని తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను తన కార్యకర్తల ఎదుగుదలకు అడ్డుపడుతున్న వారిని, అధికారులను పింక్ బుక్కులో పేర్లు నమోదు చేస్తున్నట్లు తనపై అభిమానాన్ని చాటుతున్న వారి పేర్లను మరోపక్క నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఆదరించిన వారిని అదలమెక్కిస్తానని అడ్డుపడిన వారిని జైలు కూడు తినిపిస్తానన్నారు.

పిట్ట బెదిరింపులకు భయపడితే తెలంగాణ వచ్చేదా అంటూ ప్రశ్నించారు. గత పదేళ్లు చేసిన అభివృద్ధి మాదిరి పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని మరికొద్ది రోజుల్లో పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం నుంచి 20 మంది ముందుకు రావాలని వారి అభివృద్ధి కోసం పని చేస్తానన్నారు. మీరు ఆదరిస్తే మళ్లీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ దేనిని తాను మంత్రిని అవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో చెత్తాచెదారం వైదొలిగిందని నికార్సైన కార్యకర్తల కోసం పనిచేస్తానన్నారు. గతంలో కిందిస్థాయి క్యాడర్ను పట్టించుకోకపోవడం వల్లే నష్టం జరిగిందన్న విషయాన్ని తాను గుర్తించినట్లు తెలిపారు. పార్టీని వీడిన వారిని మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని అవసరం పడితే అది గ్రామీణ ప్రాంత నాయకత్వానికే అవకాశం కల్పిస్తానన్నారు.