బిడకన్నె మాజీ సర్పంచ్ మృతి.. పాడే మోసిన ఎమ్మెల్యే
జహీరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : జరాసంఘం మండలం బిడకన్నె గ్రామ మాజీ సర్పంచ్ సంజీవులు బావిలో పడి మృతి చెందారు. గురువారం సాయంత్రం తన వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన సంజీవ్ తిరిగి రాలేదు. శుక్రవారం నాడు కుటుంబ సభ్యులు బావి వద్ద ఆయన ఆనవాళ్లు కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంజీవ్ మృదేహాన్ని బావిలో నుండి తీసి పంచనామ నిర్వహించి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానికిరావు, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసి ఘన నివాళులర్పించారు. సంజీవ్ మరణం పార్టీకి తీరని లోటు అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.






