చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్, ఆగస్టు 7 (విజయక్రాంతి): చేనేత రంగ అభివృద్ధికి,నేత కార్మికులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చేనేత వస్త్రం వెనుక చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యం, అంకితభావం దాగి ఉంటాయని, చేతితో నేసిన ప్రతి వస్త్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని కలెక్టర్ అన్నారు.
యంత్రాలతో తయారయ్యే వస్త్రాలతో పోలిస్తే చేనేత ఉత్పత్తులకు కళాత్మకత, నాణ్యత, సంప్రదాయం ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం గేట్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డి ఆర్‌ఓ ఎ నిర్మలా, జిల్లా హ్యాండ్లూమ్ అభివృద్ధి అధికారి రాజేష్, చేనేత సంఘాల నాయకులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






