calender_icon.png 28 December, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్రుని కుటుంబానికి అండగా పదవ తరగతి పూర్వ విద్యార్థులు

28-12-2025 04:38:22 PM

నూతనకల్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్న మిత్రుని కుటుంబానికి అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన వేల్పుల మల్లేష్ ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న మల్లేష్ పదవ తరగతి మిత్రులు చలించిపోయారు.

తమ స్నేహితుని కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుని, అందరూ కలిసి 35,000 రూపాయల నగదును ఆదివారం మల్లేష్ కుటుంబ సభ్యులకు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.​ ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. మల్లేష్ అకాల మరణం తమను ఎంతగానో కలిచివేసిందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి తమ వంతు చిన్న సహాయం అందించామని తెలిపారు. మిత్రుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. తమ స్నేహితునిపై ఉన్న ప్రేమతో స్పందించిన మిత్రబృందాన్ని గ్రామస్తులు, స్థానికులు అభినందించారు.