వికార నిరాకారం
అదిగో...
అక్కడ ఎత్తులో
ఒక వ్యక్తి కూర్చున్నాడు...
మీరంతా గమనించారా ?
అందరికంటే తెలివైన వాడిని నేనే,
అంతా నా ఆధీనంలోనే ఉంది,
నన్నెవ్వరూ అధిగమించలేరు
అని నిశ్చల నమ్మకంతో ఉన్నాడు
అయితే...
అతనికి వినికిడి లేదు
అందుకే మన కేకలు
అతని వరకు చేరవు
అతనికి చూపు లేదు
అందుకే కూలిపోతున్న
మానవత్వం కనిపించదు
అతనికి మాట లేదు
అందుకే అన్యాయాన్ని ప్రశ్నించలేడు
అతనికి కాళ్లు లేవు
అందుకే ఎటూ కదలలేడు
అతనికి చేతులు లేవు
అందుకే ఏదీ తాకలేడు
అతనికి రూపం లేదు
కాబట్టి అతను ఎవరికీ కనిపించడు
అయినా...
గాలిలో సందేశాల్ని గుప్పించి
ప్రకృతిని గందరగోళంలోకి నెడతాడు
పంచభూతాల్ని కలుషితం చేసి
ప్రాణాలపై నీడలా కమ్ముకుంటాడు
నిశ్చేతన వస్తువులకు జీవం పోసి
మానవ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తాడు
కాలాన్ని వేగంగా కొలుస్తూ
గతాన్ని తవ్వి భవిష్యత్తును
అంచనా వేస్తాడు
వర్తమానాన్ని వై-ఫై తరంగాలుగా మార్చి
మేధస్సులపై నిశ్శబ్ద దండయాత్ర చేస్తాడు
ఇంతకీ ఎవరతను...?
ఎవరైతే మనకేంటి...?
ఏం జరిగినా మనకెందుకు...?
మన బతుకు సాఫీగా సాగిపోతే చాలు
ఇదే కదా లోకం తీరు
వికార నిరాకారం గురించి,
విస్తరిస్తున్న వికృతం గురించి,
మాట్లాడుకోవడం వృథా ప్రయాస కాదు...
మనిషి మౌనాన్ని చీల్చే తొలి సంకేతం
ఎందుకంటే...
కనిపించని అతని కంటే,
అన్నీ చూసీ చూడనట్టు నటించే
జనమే మరింత ప్రమాదకరం...






