ప్రకృతిమార్గం
ఆ చిట్టిచెట్టు- పాత రహదారి
పక్కన కంచెతో
వేసవి సూర్యుడి ఆలనపాలనలో పెరిగింది,
‘నేను పొడవుగా
పెరగాలనుకుంటున్నా’ నంటూ
‘పెరగడమన్నది తన కెంతో
సరదా’ అని చెప్పింది!
ఆ చిట్టివాగు- చిన్నవంతెన
కిందుగా పరుగెత్తుతూ
కోతల కబుర్లతో రోజంతా
పాడుతూనే ఉంది,
‘నేనొక నదిని కావాలనుకుంటున్నా’ననీ
‘కనుకే, నా దారిలో
త్వరపడుతున్నాను’ అన్నది!
ఆ చిట్టిపక్షి- గూటి నుంచి బయటకు వచ్చి,
రెక్కలు విప్పి టపటపా శబ్దం చేసి,
పెరడు పైగా అడ్డంగా
అటూయిటూ ఎగిరింది,
‘నేను పెద్దపక్షినవుతాను’ అనీ,
‘ప్రతిరోజూ నిజంగా ఎంతో
కష్టంగా ప్రయత్నిస్తే...’
అంటూ కిలకిలారావాలు చేసింది!
ఆ చిట్టిబాలుడు -కాళ్ల కొనవేళ్లపై నిక్కి,
ఇప్పటి తన ఎత్తుకన్నా ఎత్తుగా
చూసుకుని వాలి
మళ్లీ ఎప్పటివలే పాదాలపై నిలుచున్నాడు,
‘నేను మిగతావచ్చే జీవితా
న్నిష్టపడుతున్నా’ననీ,
‘నేను పెరిగి పెద్దవాడినై విశాలప్రపంచాన్ని
చూడాలనుకుంటున్నా’ననీ
‘నా కేది చాలా మంచిదో, అంత వేగంగా
పెరగాలనుకుంటున్నానూ’
అని చెప్పాడతడు!
ప్రకృతిమాత- రెక్కలు వచ్చిన
వారి వైఖరుల చూసి
ఒక్క చిరునవ్వు నవ్వింది,
కానీ అట్లే ఉండిపొమ్మనీ చెప్పలేదు,
ఎందుకంటే జీవనమూ,
పెరగడమూ, వయస్సూ
ఇవి- ఎప్పటికీ ప్రకృతిమార్గంలో
సాగేవే అనీ ఆమెకు తెలుసు!!!
(ఆంగ్లమూలం: లెనోర్ హెట్రిక్ )






