20 June, 2026 | 2:38 AM

నేడు ‘కోల్ గ్యాసిఫికేషన్’కు శంకుస్థాపన

20-06-2026 12:00 AM
  1. ఇంధన భద్రతలో కీలక ముందడుగు
  2. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా చరిత్ర పుటల్లోకి
  3. ఒడిశాలోని లఖన్‌పూర్‌లో రూ.25,016 కోట్లతో ఏర్పాటు
  4. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతో పాటు దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా మరో కీలక ముందడుగు పడనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా లఖన్‌పూర్‌లో రూ.25,016 కోట్లతో చేపట్టనున్న కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శనివారం మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కేంద్రమంత్రి ప్రకటనను విడుదల చేశారు.

ఈ ప్రాజెక్టు వల్ల ఇంధన భద్రతను బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, బొగ్గుకు మరింత విలువ పెంచడంతో పాటు, అనుబంధ రంగాల అభివృద్ధికి కీలకంగా మారనుందన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గును సిన్‌గ్యాస్‌గా మారుస్తారని, దీన్ని ఉపయోగించి మిథనాల్, యూరియా, అమ్మోనియం నైట్రేట్, సింథటిక్ నేచురల్ గ్యాస్ (ఎస్‌ఎన్‌జీ) వంటి అనేక ఉత్పత్తులు, రసాయన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను తయారు చేసే అవకాశం ఉంటుందన్నారు. 

గ్యాసిఫికేషన్‌తో పరిశ్రమల వృద్ధి..

బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ తయారు చేసేందుకు దేశంలో స్థాపించనున్న తొలి ప్రాజెక్టుగా చరిత్ర పుటల్లో నిలవనుందని తెలిపారు. దీన్ని భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. ఇది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కోలిండియా లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ అని తెలిపారు. ఈ ప్లాంటులో బెల్ స్వదేశీ పరిజ్ఞానంతో రోజుకు 2 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేయనుందన్నారు.

సుమారు 350 ఎకరాల భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇప్పటికే వచ్చాయని, శంకుస్థాపన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. కేంద్ర బొగ్గు శాఖ త్వరితగతిన అనుమతులు ఇవ్వడమే కాకుండా, ఇన్సెంటివ్ పథకం కింద రూ.1,350 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని తెలిపారు. లఖన్‌పూర్ ప్రాజెక్టు.. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా చేపట్టే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు మోడల్‌గా నిలవనుందని, తయారీ రంగంలో స్వావలంబన సాధించడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా కానుందన్నారు. దీంతో పరిశ్రమల వృద్ధికి మరింత ఊతం, ముడి పదార్థాల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతోపాటు దేశ ఇంధన, ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేస్తుందన్నారు.