ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
రూ.76 కోట్లతో నార్కెట్పల్లిబ్రహ్మణవెల్లంల రైల్వే ఫ్లైఓవర్కు శంకుస్థాపన
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక అడుగు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
చిట్యాల, జూలై 12: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌ లిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం నార్కెట్పల్లి మండలం నుంచి బ్రహ్మణవెల్లంల గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గంలో రూ.76 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన రహదారి మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో నార్కెట్పల్లి, బ్రహ్మణవెల్లంలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి, అత్యవసర సేవలు మరింత వేగవంతమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వే ముల వీరేశం మాట్లాడుతూ, ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం నకిరేకల్ నియోజకవర్గానికి చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. రూ.76 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రయాణికులు ఎంతో ప్రయోజనం పొందుతారని తెలిపారు.
నియోజక వర్గంలో రోడ్లు, వంతెనలు, తాగునీరు, విద్య, వైద్యం తదితర రంగాల్లో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగు ణంగా మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు శంకుస్థాపన ఫలకా న్ని ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.






