27 February, 2026 | 1:04 AM

నలుగురి నకిలీ డాక్టర్ల అరెస్టు

26-02-2026 12:49 AM
  1. మహాలక్ష్మి కంటి ఆసుపత్రి పేరిట అక్రమ చికిత్సలు 

ఓ రోగికి అవసరంలేని ఆపరేషన్‌తో వెలుగులోకి

మిర్యాలగూడ, ఫిబ్రవరి 25: అర్హత లేకున్నా కంటి ఆసుపత్రి ఏర్పాటు చేసి కంటి వైద్యుడిగా సేవలు అందిస్తున్న నకిలీ వైద్యులను బుధవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేములపల్లి మండలం రావుల పెంట గ్రామానికి చెందిన పజ్జురి వికాస్ కుమార్ డిగ్రీ మధ్యలోనే ఆపివేసి, సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో డిప్లొమా ఇన్ ఆప్తమాలమిక్ అసిస్టెంట్ కోర్సు చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని బ్రాన్స్ ఐ క్లినిక్, శ్రీ నేత్రాలయ ఆసు పత్రులతో పాటు మిర్యాలగూడ హనుమాన్ ఐ క్లినిక్‌లో పదేండ్లకు పైగా పని చేశాడు.

అనంతరం  ఒక కన్సల్టింగ్ అప్తాలమిస్ట్ డాక్ట ర్ పేరుతో శ్రీ మహాలక్ష్మి కంటి ఆసుపత్రి ప్రారంభించి, డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడు. 2025 జూన్ 8న బైరెడ్డి పద్మ అనే మహిళ కంటి సమస్యతో ఆసుపత్రికి రాగా కుడికంటిలో చుక్క ఉన్నదని సర్జరీ చేయించాడు. సర్జరీ జరిగిన మరుసటి రోజు కన్ను పూర్తిగా కనపడక పోవడంతో ఆందోళన చేయగా వారికి కొన్ని మందులు ఇచ్చి పంపేశాడు. ఇదే క్రమంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం మిర్యాలగూడలో తనిఖీ చేసి మహాలక్ష్మి, శాలిని, యశస్వి, అన్నపూర్ణ, రాఫ్ ఐ క్లినిక్ ల్లో అసిస్టెంట్లు వైద్యం చేస్తున్నట్లు గుర్తించి పోలీసులకు నివేదించారు.

మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ నాగభూషణ రావు కేసు దర్యాప్తు చేసి అర్హత లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్న వైద్య సేవలతో మోసం  చేస్తున్న వికాస్ కుమార్‌తో పాటు వల్కి శ్రీను, పెమ్మి వెంకటేష్, బనావత్ శివ కోటేశ్వర్‌రావు, గడ్డం నాగరాజులను అనర్హులుగా గుర్తించి కేసు నమోదు చేశారు.