17-02-2025 12:58:01 PM
మైసూరు,(విజయక్రాంతి): కర్ణాటకలోని మైసూరు(Mysuru)లో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో(Financial Difficulties) ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన విశ్వేశ్వరయ్య నగర్ లో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైసూర్ కు చెందిన చేతన్ అనే వ్యక్తి వ్యాపారం చేసుకొంటు సంకల్ప్ సెరీన్ అపార్ట్ మెంట్ లో జీవనం కొనసాగిస్తున్నాడు. తన జీవితాన్ని ముగించే ముందు చేతన్ అమెరికాలో నివసిస్తున్న తన సోదరుడు భరత్‌కు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఏమి జరుగుతుందో చెప్పడానికి ఫోన్ చేశాడు. మేము ఆత్మహత్య చేసుకుని చనిపోబోతున్నాం అని చేతన్ తన సోదరుడికి చెప్పి కాల్ డిస్‌కనెక్ట్ చేశాడు. దీంతో భయాందోళనకు గురైన భరత్ వెంటనే చేతన్ అత్తమామలను అప్రమత్తం చేసి, సంకల్ప్ సెరీన్ అపార్ట్ మెంట్ కు వెళ్లమని కోరాడు. దురదృష్టవశాత్తు, చేతన్ అత్తగారు వచ్చేసరికి, అప్పటికే విషాదం జరిగిపోయింది.
అతడి భార్య, కుమారుడు విగతజీవులుగా ఉన్నారు. పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ లో తన తల్లి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న కమిషనర్ సీమా లట్కర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ అండ్ ట్రాఫిక్) ఎస్ జాన్హవి, విద్యారణ్యపురం ఇన్స్పెక్టర్ మోహిత్ వంటి సీనియర్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులను విచారించారు. భార్య, కుమారుడు, తల్లికి విషమిచ్చి చేతన్ ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతులు ప్రియంవద(62), చేతన్(45), రూపాలి(43), కుషాల్(15)గా గుర్తించారు. అయితే మృతులు గత 10 సంవత్సరాలుగా సంకల్ప్ సెరీన్ అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడు కనిపించలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వ్యాపారం మొత్తం దెబ్బతియడంతో అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదు.