నాలుగు లేబర్ కోడ్స్ సింగరేణిలో అమలు చేయొద్దు
మణుగూరు, మార్చి 31 (విజయక్రాంతి) : కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఐ ఎన్ టి యు సి, ఐ ఎఫ్ టి యు, సిఐటి యు, హెచ్‌ఎంఎస్,టీబీజీకేఎస్, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మంగళవారం ఏరియా అధికార ప్రతినిధి సలగల రమేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ,దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా కేంద్రం ఈ నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని విమర్శించారు. కేరళ తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కోడ్లను వ్యతిరేకిస్తూ శాసనసభలో తక్షణమే తీర్మానం చేయాలన్నారు.
నాలుగు లేబర్ కోడ్లను ఏప్రియల్ ఒకటి నుండి దేశ వ్యాప్తంగా అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, ఈ కోడ్ లను సింగరేణిలో అమలు చేయకుండా యాజమాన్యం, కార్మిక సంఘాల అభిప్రా యాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు వత్సవాయి కృష్ణంరాజు ,సిల్వేరు గట్టయ్య, ఐ ఎఫ్ టి యు నాయకులు యస్ డి నాసర్ పాషా, హెచ్ ఎం ఎస్ నాయకురాలు కొడిపల్లి శ్రీలత, సిఐటియు నాయకులు మొహ మ్మ ద్ ముజఫర్ ,టీబీజీకేఎస్ నాయకు లు నాగేల్లి వెంకట్, బంగారి పవన్ కుమార్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ పాల్గొన్నారు.




