calender_icon.png 22 July, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా

22-07-2025 01:28:57 AM

అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్టు ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 21 : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలను కారణంగా పేర్కొన్న జగదీప్ ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం ఆయన రాజీనామా చేశారు.  ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతిగా అవకాశమిచ్చిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భం గా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే జగదీప్ ధన్‌ఖడ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘ఆరోగ్య సంరక్షణతో పా టు వైద్యుల సలహాలను పాటించేందుకు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. నా పదవీ కాలంలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. వారి నుంచి లభించిన అమూల్యమైన సహకారం, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

పదవీ కాలం లో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. అనేక అనుభవాలను మూటగట్టుకున్నాను. ఉపరాష్ట్రపతిగా.. దేశ ఆర్థిక పురోగతిని, అభివృద్ధిని గమనిం చే అవకాశం రావడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నా. ఇది నాకు సంతృప్తినిచ్చింది. ప్రపంచ వేదిక పై భారత్ విజయాల పట్ల గర్విస్తున్నాను. దేశ ఉజ్వ ల భవిష్యత్తుపై అచంచలమైన విశ్వాసముంది’ అని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

2022 ఆగస్టు 11న జగదీప్ ధన్‌ఖడ్ భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2022లో ధన్‌ఖడ్ 74.37 శాతం ఓట్ల మెజా ర్టీతో 1992 తర్వాత అత్యధిక మెజార్టీతో ఉపరాష్ట్రపతిగా ఎంపికైన వ్యక్తిగా నిలిచారు. 1992 ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో కేఆర్ నారాయణ్ తన ప్రత్యర్థి కాకా జోగిందర్ సింగ్‌పై 700 ఓట్ల మెజార్టీ (99.85 శా తం)తో గెలుపొందారు.

న్యాయవాదిగా.. ఆపై రాజకీయ వేత్తగా

రాజస్థాన్ ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెం దిన జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కిథనా గ్రామంలో జన్మిం చారు. ఎల్‌ఎల్‌బీ కోర్సు తర్వాత 1979 నవంబరులో రాజస్థాన్‌లోని బార్ అసోసియేషన్‌లో న్యా యవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజస్థా న్ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీ స్ చేశారు. జనతాదళ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగదీప్ ధన్‌ఖడ్..

1989 నుంచి 1991 వరకు రాజస్థాన్‌లోని ఝుంఝును లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ స మయంలో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ క్యాబినెట్ లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి గా పనిచేశారు. 1991లో కాంగ్రెస్‌లో చేరిన జగదీప్ ధ న్‌ఖడ్ 1993లో రాజస్థాన్‌లోని కిషన్‌గర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ను ంచి 2022 వరకు బెంగాల్ గవర్నర్‌గా పనిచేశా రు.

జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయం లో గతేడాది డిసెంబర్‌లో ఆయన పక్షపా తంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభిశంసన నోటీసు ఇ చ్చింది.ఎగువ సభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రతిపక్షాల నోటీసును తిరస్కరించిన సంగతి తెలిసిందే.