29-04-2025 12:00:00 AM
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 28: చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడకు చెందిన చెందిన శ్యామ్ సుందర్, మాధవి కుమార్తె తన్విక (4) ఆదివారం ఇంట్లో ఉన్న వేరుశెనగ గింజలు తినడంతో ఆ గింజలు కాస్తా.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లి.. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో చిన్నారి తన్విక అపస్మాక స్థితిలోకి వెళ్ళింది.
వెంటనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్ తన్విక ఊపిరితిత్తులలో వేరుశెనగ గింజలు ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆపరేషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో.. తన్విక మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు.