calender_icon.png 5 November, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలికుంటు నివారణకు పకడ్బందీ చర్యలు

05-11-2025 08:13:29 AM

పశువులకు ఉచిత టీకా కార్యక్రమం ప్రారంభం

కల్వకుర్తి రూరల్: పాడి పశువులను గాలికుంటు వ్యాధి బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని రాష్ట్ర మానిటరింగ్ టీం డాక్టర్ వెంకటయ్య గౌడ్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ జ్ఞాన శేఖర్ తెలిపారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కల్వకుర్తి మండలంలోని జీడిపల్లి గ్రామంలో పశువులకు ఉచిత టీకాలు వేసే కార్యక్రమాన్ని వారు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 14 వరకు మండల వ్యాప్తంగా ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గాలికుంటు వ్యాధి సోకితే పశువులలో పాల ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతాయని, వ్యాధి తీవ్రత పెరిగితే పశువులు మరణించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. వ్యాధి లక్షణాలను తొలిదశలోనే గుర్తించి, సమీప పశు వైద్య అధికారుల సలహాలు పాటిస్తే పశుసంపదను కాపాడుకోవచ్చని వారు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏడీ డాక్టర్ భాస్కర్ రెడ్డి, మండల పశు వైద్య అధికారి డాక్టర్ నాగరాజ్, సిబ్బంది జెవిఓ రాజు, ప్రణీత, ఆంజనేయులు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.