‘స్వేచ్ఛ’ మన రక్షణ కవచం
స్వాంతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ
న్యూ ఢిల్లీ, ఆగస్టు 15: భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఇచ్చిన అత్యున్నత వరం స్వేచ్ఛ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వేచ్ఛ అనేది ఒక పదం కాదు రాజ్యాంగం సమాన్యుడికి ఇచ్చిన అత్యున్నత వరం’ అని అన్నారు. తన చివరి శ్వాస వరకు రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తా అని స్పష్టం చేశారు.
రాహుల్ సీటుపై విమర్శలు..
ఎర్రకోటలో గురువారం నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన సీటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వేడుకల్లో రాహుల్ గాంధీకి చివరి వరుసలో సీటు కేటాయించారు. దీంతో ఆయన ఒలంపిక్ విజేతలతో కలిసి చివరి వరుసలో కూర్చున్నారు. ప్రొటోకాల్ ప్రకారం లోక్‌సభలో ప్రతిపక్ష నేతకు.. క్యాబినెట్ మంత్రులతో సమానంగా ముందు వరుసలో సీటు కేటాయిస్తారు. కానీ రాహుల్ గాంధీకి చివరి వరుసలో సీటు కేటాయించారు.




