5 April, 2026 | 5:31 AM

గజ్వేల్‌లో హైటెన్షన్!

05-04-2026 01:14 AM
  1. కార్యకర్తలతో కలిసి మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించిన డీసీసీ అధ్యక్షురాలు అంక్షారెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటం బిగింపు
  2. ప్రజలకు అందుబాటులోలేని కేసీఆర్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదు 
  3. కేసీఆర్ ప్రజల్లోకి రాకుంటే ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌ను ముట్టడిస్తాం: ఆంక్షారెడ్డి
  4. నిరసనగా రేపు గజ్వేల్ బంద్‌కు బీఆర్‌ఎస్ పిలుపు

గజ్వేల్, ఏప్రిల్ 4: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం హైటెన్షన్ నెలకొంది. ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులోకి రావాలని డిమాండ్‌చేస్తూ కేసీఆ ర్ క్యాంపు కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షురాలు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్య కర్తలు, నాయకులు ముట్టడించారు. గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు.

ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని బిగించి, బీఆర్‌ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు దుండ గులు కార్యాలయంపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వసంచేశారు. క్యాంపు కార్యాలయంపై కాం గ్రెస్ పార్టీ గుండాలు దాడిచేశారంటూ గజ్వే ల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ వంటే రు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. కార్యాలయంపై దాడికి నిరసనగా సోమవారం గజ్వే ల్ బంద్‌కు పిలుపునిచ్చారు.

గజ్వేల్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కేసీఆర్ ఇప్పటికే రూ.1.20 కోట్ల వేతనం, ఇతర అలవెన్సులు పొందినట్లు అంక్షారెడ్డి ఆరోపిం చారు. గజ్వేల్ ప్రజల సొమ్మును అప్పనంగా అనుభవిస్తూ  ప్రజలకు సేవచేయని ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే గవర్నర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండని కేసీఆర్ ఒక్క క్షణం కూడా ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేగా కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచినట్లు స్పష్టంచేశారు. ఇప్పటికైనా స్పందించకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌ను ముట్టడిస్తా మని హెచ్చరించారు. కేసీ ఆర్ క్యాంపు కార్యాలయాన్ని కలెక్టర్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్ గజ్వేల్ ప్రజల ను పట్టించుకోకున్నా సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగినన్ని నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మె ల్యే తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు చేరుతుం టే జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుతగులుతున్నట్లు వివరించారు.

ఈ కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, నాయకులు సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు. కాగా బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు మేరకు ఈ సంఘట నపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దాడి జరగలేదు.. సీఎం చిత్రపటమే పెట్టాం: నర్సారెడ్డి

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆస్తిగా ఉన్న క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటం లేకపోవడం గమనించి తమ పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్లి చిత్రపటాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘క్యాంప్ కార్యాలయం ప్రభుత్వానికి చెందినది. అక్కడ ముఖ్యమంత్రి చిత్రపటం ఉండటం సహజం. అది లేకపోవడంతో మా కార్యకర్తలు వెళ్లి గౌరవంగా సీఎం చిత్రపటాన్ని పెట్టి వచ్చారు.

అంతే తప్ప అక్కడ ఎలాంటి దాడులు, విధ్వంసం జరగలేదు’ అని స్పష్టంచేశారు. ‘కావాలనే కొందరు ఈ సంఘటనను వక్రీకరించి దాడిగా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం. మా కార్యకర్తలు ఎలాంటి అశాంతి సృష్టించలేదు. ఎవరి ఆస్తినీ ధ్వంసం చేయలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ రాద్ధాంతం సృష్టిస్తున్నారు’ అని చెప్పారు. 

ప్రజాస్వామ్యం ఖూనీ: వంటేరు

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేశారంటూ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదుచేశారు.

క్యాంపు కార్యాలయంపై దాడిచేసిన వారిని 24 గంటల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమేనన్నారు. దాడికి నిరసనగా సోమవారం ప్రజాస్వామ్యబద్ధంగా గజ్వేల్ బంద్‌కు పిలుపునిస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రజాపాలన లేదు, కాంగ్రెస్ పార్టీ గుండాల నడుస్తుందన్నారు.