2 April, 2026 | 2:18 AM

ద్విముఖం నుంచి త్రిముఖానికి

06-05-2024 01:38 AM

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం

కేసీఆర్ బస్సుయాత్రతో సర్వత్రా ఉత్సాహం

ప్రజలను ఆకట్టుకుంటున్న కేసీఆర్ ప్రసంగాలు

లోక్‌సభ స్థానాల్లో జోరు పెంచిన బీఆర్‌ఎస్ 

నెల రోజుల క్రితం.. ఎన్నికల షెడ్యూల్ విడుదలై,  ప్రచారం మొదలైన సమయంలో బీఆర్‌ఎస్ పార్టీలో స్తబ్ధత నెలకొంది. సర్వత్రా నైరాశ్యం. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలోకి అడుగుపెట్టని సమయం అది. బీఆర్‌ఎస్ పార్టీ మనుగడే కష్టమంటూ అందరూ అంచనాలు వేశారు. బీఆర్‌ఎస్ పోటీలోనే లేదు.. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు.

ఇప్పుడు.. నెల రోజులు గడిచింది.. ఎండలు ముదిరాయి.. రాజకీయం కూడా అంతకన్నా వేడెక్కింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార రంగంలోకి దిగారు. తన ప్రచారం స్టయిల్, ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఒకింత ధైర్యం వచ్చినట్ట య్యింది. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు బీఆర్‌ఎస్ కూడా పోటీలో నిలుస్తోంది. దీంతో త్రిముఖ పోటీ ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): నెల రోజుల క్రితం నాటి రాష్ట్రంలో ఎన్నికల రాజకీయ పరిస్థితికి, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి స్పష్టమైన తేడా కనపడుతుంది. అప్పట్లో పార్టీ ఉంటుందా? ఊడుతుందా? అనే అనుమానంతో ఉనికినే కాపాడుకోవడానికే నానాపాట్లు తప్పవేమో అని అంచనాలు వేసిన విశ్లేషకులు సైతం ఇప్పుడు బీఆర్‌ఎస్ కూడా పుంజుకుంటోందనే చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార రంగంలోకి దిగటమే. అసెంబ్లీలో పరాజయం చవిచూసిన కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికల రంగంలోకి అడుగు పెడతారా అనే అనుమానాలు కూడా అప్పట్లో ఉండేవి.

అయితే అవన్నీ అనుమానాలేనంటూ.. కేసీఆర్ ప్రచారంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనదైన వాగ్దాటి, పంచ్‌లు, విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కరెంట్, రైతులు, సాగునీరు లాంటి అంశాలను లేవనెత్తుతూ ముందుకు సాగడం ప్రజలను మలుపుతిప్పేలా చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగడం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అసలు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీటన్నా గెలుస్తుందా అనే అనుమానాలను వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలైతే సున్నా అంటూ ప్రచారంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనపడుతున్నది.  

అసెంబ్లీ ఎన్నికలకంటే ఇప్పుడే ప్రజల్లో స్పందన 

నిజానికి కేసీఆర్ ప్రసంగాలంటేనే ప్రజల్లో ఒకింత ఆసక్తి నెలకొంటుంది. అయితే గత పదేండ్ల పాలనలో ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ప్రజలను కలవరు అనే ప్రచారంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రసంగాలకు ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదు. కానీ, పార్టీ ఉంటుందా.. ఊడుతుందా అనే సందిగ్ధం మధ్య లోక్‌సభ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. బస్సు యాత్ర కొనసాగుతున్న మార్గాల్లో, కార్నర్ మీటింగుల్లో కేసీఆర్ ప్రసంగం వినడానికి జనం భారీగా తరలివస్తున్నారు.  పార్టీ పరంగా జనాలను తరలించడం ఒకెత్తయితే, స్వచ్ఛందంగా కేసీఆర్ చెప్పేది విందామని హాజరయ్యేవారు కూడా ఉండటం విశేషం. ఈ స్పందనే ద్విముఖ పోటీ నుంచి త్రిముఖం దిశగా అనే అంచనాలకు దారి తీస్తున్నది.

మారిన పరిస్థితి..

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల రాజకీయ పరిస్థితి ద్విముఖం నుంచి త్రిముఖం వైపుగా మళ్లుతున్న సంకేతాలు కనపడుతున్నాయి. పెద్దపల్లి, జహీరాబాద్, మహబూబాబాద్, భువనగిరి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్ లాంటి నియోజకవర్గాల్లో మేముకూడా పోటీలో ఉన్నామనే సంకేతాలను బీఆర్‌ఎస్ అభ్యర్థులు స్పష్టంగా పంపిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్, ఖమ్మంలాంటి స్థానాల్లో ద్విముఖ పోటీలో మేమూ ఉంటామని నమ్మకంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే గడిచిన నెల రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితిలో స్పష్టమైన మార్పు మాత్రం కనిపిస్తున్నది. ఇది ఎంతవరకు ఫలితాలను తెచ్చిపెడుతుందనేది చెప్పలేం కానీ, పోటీలో ఉండేంతగా మార్పు వచ్చింది.

కార్యకర్తలదే భారం

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత బీఆర్‌ఎస్‌లో నైరాశ్యం నెలకొంది. పార్టీలోని పెద్దపెద్ద నేతలే బీఆర్‌ఎస్‌పై, పార్టీ అధినేత కేసీఆర్‌పై అభాండాలు వేసి, ఆరోపణలు చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఈ దశలో వచ్చిన లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్ శ్రేణుల్లో మొదట్లో కాస్త పెదవి విరుపే కనపడింది. అయితే అధినేత ప్రచారంలోకి దిగడం, ప్రజల్లోని కొన్ని వర్గాలను ప్రభావితం చేసే అంశాలను లేవనెత్తడంలో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. దీంతో పార్టీకి మొదల్లో ఉన్న ‘సున్నా’ నుంచి మూడు నాలుగు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదన్న పరిస్థితి కనిపిస్తున్నది. పైగా త్రిముఖ పోటీ ఉంది అనే చర్చ దిశగా రాజకీయ పరిస్థితిలో మార్పు కనపడుతుంది. మరో ఐదారు రోజుల్లో ప్రచారం ముగియనుంది.

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేని కార్యకర్తల బలం బీఆర్‌ఎస్‌కు ఉంది. పార్టీ శ్రేణుల్లో అధినేత ప్రచారం నింపిన ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకెళితే అనూహ్యమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు భారమంతా కార్యకర్తలపైనే ఉందనేది పార్టీ నాయకులే చెప్తున్నారు. బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు సాగితే బీఆర్‌ఎస్ మంచి ఫలితాలనే సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మనుగడే అనుమానాస్పదం అన్న శంకను తొలగించి, అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రధాన ప్రతిపక్షం పాత్రను మరింత సమర్థవంతంగా పోషించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టవుతుంది.

అచ్చొస్తున్న సమస్యలు, సవాళ్లు

ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విభిన్న స్పందన కనిపిస్తున్నది. కొంత పాజిటివ్.. కొన్ని వర్గాల్లో నెగెటివ్.. అక్కడక్కడా అసంతృప్తి రాగం కూడా వినపడుతున్నది. సాగు, తాగు నీటితోపాటు విద్యుత్తు, రైతుబంధు, రుణమాఫీ అనే అంశాలు ఇక్కడ ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఐదు నెలల్లో ఈ మూడు అంశాలపై జరిగినంత చర్చ మరే విషయంలోనూ జరగలేదు. అందుకే ఈ మూడు అంశాలనే ఆసరాగా చేసుకుని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ మూడు అంశాలపై తాము అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితిని.. ఇప్పటి పరిస్థితిని పోల్చుతూ కేసీఆర్ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా అగ్నికి ఆజ్యం పోసినట్టు.. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావుల మధ్య కూడా ఈ మూడు అంశాలచుట్టే సవాళ్లు, ప్రతిసవాళ్ల ప్రహసనం నడుస్తున్నది.