20-08-2025 12:00:00 AM
ఖమ్మం, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనీ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎఫ్.ఆర్.ఎస్. ద్వారా హాజరు కట్టుదిట్టంగా నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఎఫ్.ఆర్.ఎస్. విధానంలో హాజరు నమోదుపై విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ విద్యా శాఖ పరిధిలో వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాలల వారీగా పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పర్చాలని అన్నారు. భవిత కేంద్రాల మరమ్మత్తు అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల గైర్హాజరుకు గల కారణాలు తెలుసుకొని, ఫాలో అప్ చేస్తూ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా చూడాలని, ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అంశంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని అన్నారు.
టీచర్లు, విద్యార్థుల హాజరు అంశం అత్యంత ప్రాధాన్యతగా పరిగణించడం జరుగుతుందని అన్నారు. ప్రతి వారం తక్కువ ఎఫ్.ఆర్.ఎస్. ఉన్న 5 మండలాల కాంప్లెక్స్ పరిధిలో ఎఫ్.ఆర్.ఎస్. అమలు, పాఠశాల నిర్వహణ పట్ల సమీక్ష నిర్వహించుకోవాలని అన్నారు.యూ.డి.ఐ.ఎస్.ఈ. పోర్టల్ లో పాఠశాలకు సంబంధించి వివరాలను అప్ డేట్ చేయాలని, ఎం.ఐ.ఎస్. కో ఆర్డినేటర్లు, హెడ్ మాస్టర్ లతో సమన్వయం చేసుకుంటూ వివరాలు నమోదు చేయాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆగస్టు చివరి నాటికి అపార్ నెంబర్ జనరేట్ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి నాగ పద్మజ, విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.