calender_icon.png 28 October, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు పాటించని ఫంక్షన్ హాళ్లు

28-10-2025 12:00:00 AM

-షెడ్ల పేరుతో ఫంక్షన్ హాళ్ల నిర్మాణం

-ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న రిసార్టులు

-అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆరోపణలు

-మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి

తుర్కయంజాల్, అక్టోబర్ 27: తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఫంక్షన్ హాళ్లకు హబ్ గా మారింది. వేలాదిమందికి సరిపోయే ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఇప్పటికే వెలిశాయి. ఇంకొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. ఇవే కాకుండా పదుల సంఖ్యలో రిసార్టులు నిర్మితమవుతున్నాయి. అయితే ప్రజల అవసరాలను ఆసరా చేసుకుంటున్న ఫంక్షన్ హాళ్ల యజమానులను నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో ఫంక్షన్ కు రూ.10లక్షల వరకు వసూలు చేస్తూ... సరైన వసతులు కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా హాళ్ల నిర్వహణ

మున్సిపాలిటీ పరిధిలో పేరెన్నికగన్న రెండు బడా కన్వెన్షన్ హాళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ ఏర్పడి ఏడేళ్లు దాటినా... ఇంకా గ్రామ పంచాయతీ పన్నే చెల్లిస్తున్నట్లు వినికిడి. కొన్నేళ్లుగా ఆస్తి పన్ను ఎగవేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ఫంక్షన్ హాళ్ల యజమానులు షెడ్ల పేరుతో ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫంక్షన్ హాళ్ల యజమానులతో కొందరు మున్సిపల్ అధికారులు లాలూచీపడి, తక్కువ పన్ను వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీకి పన్నులు ఎగ్గొట్టి, వారు మాత్రం లక్షల రూపాయలు ఆర్జించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా అధికారులు మిన్నకుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కరువు

ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్టులపై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఎలాంటి అనుమతులు లేకుండా రిసార్టులు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నిబంధనలు పాటించని ఫంక్షన్ హాళ్లను తనిఖీ చేసి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అనుమతులు లేకుండానే ఏళ్లుగా కొనసాగుతున్నా.. కాగా అసలు నిర్మాణపరమైన అధికారులు ఇన్నాళ్లూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కొన్ని ఫంక్షన్ హాళ్లలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బయట పడటానికి అవసరమైన మార్గాలూ లేకపోవడం గమనార్హం.

రోడ్లపైనే వాహనాల పార్కింగ్

ఇంజాపూర్, మన్నెగూడలోని కొన్ని ఫంక్షన్ హాళ్లకు అసలు పార్కింగ్ సౌకర్యమే లేకపోవడం శోచనీయం. ఇంజాపూర్లోని ఫంక్షన్ హాళ్లలో ఏదైనా వేడుక జరిగితే ప్రజలు సాగర్ రోడ్డుపైనే వాహనాలను నిలుపుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్డు మధ్యలోని డివైడర్ ను ధ్వంసం చేసి ఇష్టారీతిన వాహనాలను యూటర్న్ లు చేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపానపోవడం లేదు. మన్నెగూడలో ఉన్న రెండు ఫంక్షన్ హాళ్లు పెద్దవి కావడంతో వీఐపీల తాకిడి ఎక్కువ ఉంటుంది. అయితే పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్న సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాం అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.