calender_icon.png 8 November, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటారం ఎంపీడీఓ కార్యాలయంలో నిధులు గోల్ మాల్?

08-11-2025 08:05:42 PM

* ఉద్యోగి జీత భత్యాల్లో సైతం చేతివాటం

* నిర్వహణ ఖర్చుల పేరిట నిధులు హాంఫట్

* రూ 3 లక్షల మేర మాయం

* ఉపాధి హామీ, నీటి సరఫరాలోనూ ఇదే తంతు

కాటారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిషత్ కార్యాలయంలో నిధులు గోల్ మాల్ జరిగినట్లు విదితమవుతుంది. కార్యాలయంలోని అధికారులు తలా కొంత వాటాల పంపకంతో నిధులు మాయం చేసినట్లు స్పష్టమవుతుంది. వాటాల పంపకంలో తేడాలు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కాటారం మండల ప్రజా పరిషత్ లో సుమారు మూడు లక్షల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  కార్యాలయ నిర్వహణ ఖర్చుల పేరట కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగి, క్రింది స్థాయి ఉద్యోగి ప్రభుత్వ నిధులను గోల్ మాల్ చేసినట్లు వినికిడి.

కార్యాలయంలో జరిగిన ఖర్చు కు భిన్నంగా కొన్ని నకిలీ బిల్లులు పెట్టి సుమారు   రూ. 3 లక్షల 8 వేలు కాజేశారని తెలుస్తోంది ?. వాటాల పంపకంలో తేడాలు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి సొంత డబ్బులతో రెండున్నర సంవత్సరాల కాలం పాటు కార్యాలయ నిర్వహణ ఖర్చులు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో ఆ ఉద్యోగి తన స్వంత జేబు లోంచి  కార్యాలయ నిర్వహణ ఖర్చులకు వెచ్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు  పెండింగ్ లో ఉన్న బిల్లులను మంజూరు చేసింది.

దీనిని అదనుగా భావించిన సదరు మండల స్థాయి అధికారి, తోటి ఉద్యోగి  ఇద్దరు కలిసి చేతివాటం ప్రదర్శించారు. రెండు సంవత్సరాలకు గాను సుమారు 3 లక్షల 8 వేల రూపాయల వరకు బిల్లులను పొందేందుకు రూపకల్పన చేసుకున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేకునేందుకు అందిన కాడికి దండుకునే ఆలోచన చేసినట్లు సమాచారం. గతంలో ఆయన పని చేసిన ప్రాంతాల్లో కూడా పలు మండలాల్లో ఆ అధికారికి అవినీతి మరకలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్ నిధులపై పూర్తి విచారణ చేసి సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఉద్యోగి జీతంలో వాటా అడిగిన అధికారి!

పొట్ట కూటి కోసం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి జీతంలో తన పై స్థాయి అధికారి లంచం తీసుకున్న సంఘటన  కాటారం మండల కేంద్రంలో  చోటుచేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి బదిలీపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కి వచ్చిన  ఓ గ్రామ స్థాయి అధికారి  ఎల్ పి సి సమర్పించనందుకు గాను రెండు సంవత్సరాలకు సంబంధించిన  నెలసరి జీతం సుమారు 11 లక్షల 58 వేల 592 రూపాయల బిల్లు  నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు నెలల క్రితం  రాష్ట్రంలోని అన్ని మండలాలకు  పెండింగ్ బిల్లులను  విడుదల చేసింది.

అందులో భాగంగా సదరు గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారి  పెండింగ్ జీతాన్ని పొందేందుకు  రూపకల్పన చేసుకున్నారు. నిలిచిపోయిన జీతాన్ని  పొందేందుకు  సరైన పత్రాలు  అందించినప్పటికీ తోటి ఉద్యోగి, మండల స్థాయి అధికారి  30 శాతం లంచంగా అందిస్తేనే పూర్తిస్థాయిలో బిల్లులు చేస్తామని  ఖరాఖండితంగా చెప్పడంతో సదరు  ఉద్యోగి ఖంగుతిన్నాడు. రోజులు గడుస్తున్నప్పటికీ  తన పెండింగ్ జీతాన్ని అందించడంలో  అధికారులు  మెలకపెట్టడంతో  చేసేదేమీ లేక,  జీతంలో  30 శాతం సమర్పించి జీతం పొందినట్లు సదరు ఉద్యోగ తన తోటి ఉద్యోగుల ఎదుట వాపోయినట్లు సమాచారం.

సదరు గ్రామ స్థాయి అధికారి చెప్పేదంతా చెప్పి  పేపర్ లో రాయవద్దని  బతిమాలడం కొసమెరుపు. మండలంలోని ఒక ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో తోటి ఉద్యోగులకు బిల్లులు మంజూరు చేయడంలో చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ మండలంలో ప్రతి ఉద్యోగి కోరుకుంటున్నారు.  అభివృద్ధి నిధుల పేరిట కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రోడ్లు, గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న వాటిలో సైతం కార్యాలయాల ఉన్నత అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు వినికిడి.  కాటారం మండలం లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉద్యోగులతో పాటు ప్రజానీకం కోరుతున్నారు.