25-08-2025 01:36:47 AM
భువనేశ్వర్, ఆగస్టు 24: భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఆదివారం ఉదయం 12.30 గంటలకు ఒడిశా తీరం నుంచి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థ (ఐఏడబ్ల్యూఎస్)ను ప్రయోగించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ‘సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను డీఆర్‌డీవో ఒడిశా తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఇది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ.
ఇందులో భారత్‌లో అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్, అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్స్, హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి. దీంతో భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఈ ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించినందుకు డీఆర్‌డీవో, సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. 2035 వరకు భారత్ సుదర్శన్ చక్ర ఆయుధ వ్యవస్థను తీసుకురాబోతుందని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ విజయం సుదర్శన్ చక్ర ప్రయోగంలో కీలకం కానుంది.