calender_icon.png 25 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనిల్ అంబానీ మెడకు బిగుస్తున్న ఉచ్చు

25-08-2025 01:40:01 AM

ముంబై, ఆగస్టు 24: ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీపై కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎస్ బ్యాంక్‌ను మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యాను కూడా మోసం చేసినట్టు బ్యాంక్ ప్రకటించింది. దీంతో అతడిపై కేసు నమోదయింది. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్ సంస్థలతో సంబంధం ఉన్న కంపెనీలపై సీబీఐ, ఈడీ దాడులు చేశాయి. ముంబైలో అనిల్ అంబానీ కంపెనీలతో సంబంధం ఉన్న ఆరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో  పలు కీలకపత్రాలను స్వా ధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 

అసలేం జరిగిందంటే.. 

అనిల్ అంబానీకి చెందిన సంస్థలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 2,000 కోట్ల రుణం తీసుకున్నాయి. అయితే ఈ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఇది మోసపూరిత చర్యగా బ్యాంకు భావించింది. జూన్ 13నే బ్యాంకు ఆర్‌బీఐ నియమాల ఆధారంగా అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ది మోసపూరిత చర్యగా అభివర్ణించింది. ఈ నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో తెలుసుకునేందుకు కావాల్సిన ఆధారాలను సంపా దించడం కోసమే సోదాలు చేసినట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

ఇలాంటి చర్య ఇదే మొదలు కాదు. గతంలో కూడా ఎస్‌బీఐ ఈ విధమైన ఫిర్యాదు చేసింది. కానీ ఢిల్లీ హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ విధించింది. ఎస్బీఐ చెప్పిన ప్రకారం ఆర్‌కామ్‌కు రూ. 2,247.64 కోట్ల రుణాలు ఇచ్చింది. ఈ రుణాలను ఎస్బీఐ ఆగస్టు 2016లో మం జూరు చేసింది. ఆగస్టు 2025లో మనీలాండరింగ్, రూ. 17,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అధికారులు అనిల్ అంబానీని ప్రశ్నించారు. అప్పుడు అనిల్ అంబానీని ఈడీ అధికారులు 10 గంటల పాటు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నల అనంతరమే ఆయన స్థలాలు, సంస్థల్లో సోదాలు చేశారు. గతంలో జూలైలో ముంబై, ఢిల్లీల్లో అనిల్ అంబానీకి ఉన్న 35 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూ ప్‌తో సంబంధం ఉన్న 50 కంపెనీలు, 25 మంది వ్యక్తుల నివాస సముదాయాల్లో ఈ సోదాలు జరిగాయి. 

అనిల్ అంబానీ కంపెనీకి చెందిన కార్యాలయాలు కూడా ఇందులో ఉన్నాయి. పలు ప్రాంతా ల్లో సోదాలు జరిగినా కానీ ఆయన వ్యక్తిగత నివాసంలో మాత్రం సోదాలు జరగకపోవడం గమనార్హం. 2017-2019 మధ్య రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఎస్ బ్యాంక్ మంజూరు చేసిన రూ. 3,000 కోట్ల రుణాల విషయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. 

సోదాల్లో తేలిందిదే..  

బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులను మోసం చేయడం ద్వారా ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు ఉద్దేశించిన ‘వెల్ ప్లాన్డ్’ స్కీమ్‌గా ఈడీ ఆరోపించింది. పలు షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు, పాత క్రెడిట్ అప్రూవల్ మెమోరాండాలు (సీఏఎం), మాజీ ప్రమోటర్ రాణా కపూర్‌తో సహ ఇతర పెద్ద అధికారులకు లంచాలు ఇవ్వజూపారని తేలింది. సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును కొనసాగిస్తోంది.

నేషనల్ హౌ సింగ్ బ్యాంక్, సెబీ, ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ, బ్యాంక్ ఆఫ్ బరోడాల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 2025లో రిలయన్స్ పవర్ తరఫున నకిలీ పత్రాలు, మోసపూరిత హామీలతో ఎస్బీఐకి నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించింనందుకు ‘బిస్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్’ మేనేజింగ్ డైరెక్టర్ పార్ధసారథి బిస్వాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతే కాకుండా ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది.  ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఎస్ బ్యాంక్ కేసు ఇదే..

అనిల్ అంబానీకి చెందిన ఆర్ కామ్ కేవలం ఎస్బీఐలో మాత్రమే కాకుండా ఎస్ బ్యాంకులో కూడా రూ. 3,000 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఈ రుణాలను కూడా కంపెనీ చెల్లించకపోవడంతో ఆర్ కామ్‌ది మోసపూరిత చర్య అని బ్యాంకు గుర్తించింది. ఈ డబ్బులను అనేక షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంబానీ కంపెనీలపై ఇలా ఒక్కటని కాకుండా అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. 

నిండా మునిగిన ఎస్‌బీఐ

రిలయన్స్ ప్రతినిధులను నమ్మి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నట్టేట మునిగింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ. 2,000 కోట్ల మేర ఆ బ్యాంకు రుణాలిచ్చింది. ఆర్‌కామ్ సంస్థ తమను మోసం చేసిందని ఆలస్యంగా గ్రహించిన బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎస్బీఐ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. కేవలం మోసం చేయడం మాత్రమే కాకుండా ఈ రుణ నిధులను అక్రమమార్గాల్లో మళ్లించినట్టు బ్యాంకు ఆరోపించింది.

అనేక బహుళ జాతి కంపెనీల ప్రమేయం ఉన్నట్టు బ్యాంక్ ఆరోపిస్తూ వస్తోంది.  జూన్‌లో ఆర్‌కామ్ చర్యలను మోసంగా గుర్తించిన ఎస్బీఐ కేసు నమోదు చేసింది. ఆర్బీఐకి కూడా విషయాన్ని నివేదించింది. విషయం తెలియడంతో అనిల్ అంబానీపై బ్యాంకు చర్యలకు ఉపక్రమించింది. అనిల్ అంబానీ ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అని.. రుణం తీసుకునే ముందు ఆయన వ్యక్తిగతంగా ఎస్బీఐకి ఎలాంటి హామీ ఇవ్వలేదని అంబానీ న్యాయవాదులు వాదిస్తున్నారు.