calender_icon.png 24 January, 2026 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగా రెండు విభాగాల్లో గద్దర్ సినీ అవార్డులు

23-01-2026 12:00:00 AM

తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించిప్పటించిన తర్వాత సినీరంగ కళాకారులకు అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమానికి నిరుడు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2014-2024 మధ్య విడుదలైన సినిమాలకు ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఈ పురస్కారాల అందజేసిన విషయం విదితమే. ఈ అవార్డుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది సైతం ‘తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు’ అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ తాజాగా ఓ ప్రకటన చేసింది.

2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ద్వారా సర్టిఫికేషన్ పూర్తయిన చిత్రాలకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఫీచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యతపై ఫీచర్ ఫిలిమ్స్, పర్యావరణం, చరిత్రాత్మక, వారసత్వం, సామాజిక చైతన్యం, బాలల చిత్రాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, చలనచిత్ర రంగంలో సాంకేతిక నిపుణులు, సినిమా రంగంపై పుస్తకాలు తదితర రంగాల్లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. 

కొత్తగా రెండు విభాగాల్లో అవార్డులు 

ఇప్పటివరకు ఉన్న అవార్డు విభాగాలకు తోడు ఈసారి కొత్త విభాగాలను ప్రవేశపెట్టనున్నట్లు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎఫ్‌డీసీ ఎండీ) ప్రియాంక తెలిపారు. సామాజిక స్పృహను ప్రతిబింబించే చిత్రాలకు ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం పురస్కారం’, ప్రత్యేక విభాగంలో డాక్టర్ సీ నారాయణరెడ్డి అవార్డును అందజేయనున్నామని పేర్కొన్నారు. 

ఎంట్రీలకు ఫిబ్రవరి 3 ఆఖరు తేదీ 

గద్దర్ సినీ అవార్డులకు సంబంధించి దరఖాస్తులు, మార్గదర్శకాలను ఈ నెల 31 వరకు పొందవచ్చని, ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం filmin.telangana. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.