29-09-2025 10:56:49 AM
హైదరాబాద్: ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్లకు వెళ్లకుండానే స్మార్ట్ ఫోన్లలో సినిమాలు చూసేస్తున్నారు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు థియేటర్ లో వచ్చిన కొన్ని గంటల్లోనే ఫోన్లు దర్శనమిస్తున్నాయి. మూవీ రూల్స్, బప్పం టీవీ వంటి వెబ్ సైట్లలో కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి. వీటన్నింటికీ కారణం పైరసీలు. సినిమాలు పైరసీ చేస్తున్న దేశంలోనే అతిపెద్ద ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు(Cybercrime police) పట్టుకున్నారు. పైరసీ ముఠాకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను ఈ ముఠా పైరసీ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీకి భారీగా నష్టం చేసినట్లు పోలీసులు గుర్తించారు. హ్యాష్ ట్యాగ్ సింగిల్ సినిమా పైరసీపై చిత్రబృందం గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జులై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడలో కిరణ్ నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. పైరసీ ముఠా(Movie piracy gang) దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్ లో ఉన్నట్లు గుర్తించారు. రికార్డు చేసిన కంటెంట్ ను ఇతర వెబ్ సైట్లకు విక్రయిస్తున్న పైరసీ ముఠా గుట్టురట్టు అయింది. ఓటీటీ కంటెంట్లను ఐబోమ్మ సహా పలు ప్లాట్ ఫామ్ లకు ఈ ముఠా విక్రయిస్తోంది. నేరగాళ్లు థియేటర్ లో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్ వర్డ్ లుక్రాక్ చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా థియేటర్లలోనూ రికార్డు చేయిస్తున్నారు. ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసి రికార్డు కెమెరాలు అందజేస్తున్నారు. రహస్యంగా రికార్డు చేయటాన్ని ఏజెంట్లకు పైరసీ ముఠా నేర్పిస్తోంది. చొక్కా జేబు, పాప్ కార్న్ డబ్బా, కోక్ టిన్ లలో కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేస్తున్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో కమీషన్లు ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.