29-09-2025 08:50:55 AM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోతులను వెల్లకోట్టే ప్రయత్నంలో కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సుద్దాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దాల గ్రామానికి చెందిన బొడ్డు రాజయ్య(60) కొంతకాలం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లి ఆరోగ్యం సహకరించక తిరిగి వచ్చాడు. ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజులాగే ఇంటి దగ్గర ఉండగా కోతల గుంపు ఇంటి పైకి రావడంతో వాటిని వెళ్ళగొట్టే ప్రయత్నంలో ఒక్కసారిగా కోతులగుంపు మీదికి రావడంతో గట్టిగా అరిసి కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా పల్స్ రేటు పడిపోయిందని మృతి చెందాడని తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో పండగపూట విషాదం నెలకొంది. కోతులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కోతుల బారి నుండి తప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు.