15-09-2025 06:28:58 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తుల దొంగల ముఠాను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో కాటారం డిఎస్పి సూర్యనారాయణ వెల్లడించారు. సూర్యనారాయణ కథనం ప్రకారం అడవి ముత్తారం మండలంలో వరసగా దొంగతనాలు జరుగుతున్నవి అనే ఉద్దేశంతో అడవి ముత్తారం ఎస్సై మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో బృందం ఏర్పడి రాత్రి పూట గస్తి నిర్వహిస్తుండగా ఉదయం మూడు గంటల సమయంలో ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమాన స్పదంగా సంచరిస్తూ యామన్ పల్లి గ్రామ సమీపంలో ఉన్నారు.
వారిని పట్టుకుని లోతుగా విచారించగా ఇట్టి నలుగురు వ్యక్తులు గత సంవత్సర కాలంగా ఒక మూఠగా ఏర్పడి వారి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న మండలాల్లో మారుమూల గ్రామాల్లో ఆటోలో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తూ రాత్రి పూట వెళ్లి దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ ముఠా వివరాలు 1)చిగురు సంతోష్ కాటారం మండలం దేవరాంపల్లి.2) బుర్రకుంట ప్రకాష్, 3) జైనేని రమేష్, 4) షేక్ కుదరత్ వీళ్ళు నలుగురు ముఠాగా ఏర్పడి కాటారం మండలంలోని మూడు ట్రాన్స్ఫార్మర్ల ను, కొయ్యూరు మండలంలోని రెండు ట్రాన్స్ఫార్మర్ల ను, పలిమెల మండలంలో ఒక ట్రాన్స్ఫార్మర్ అడవి ముత్తారం మండలంలో ఒక ట్రాన్స్ఫార్మర్, మొత్తం 7 ట్రాన్స్ఫార్మర్ లను పగులగొట్టి కాపర్ (రాగి) వైరు దొంగిలించారు.
అడవి ముత్తారం మండల కేంద్రంలో రోడ్డుపై ఉన్న ఎడ్ల బండి గీరాలను, ట్రాక్టర్ బ్యాటరీని, మంథిని మండలం ఆరేంద వద్ద ఒక పవర్ టిల్లర్ ను దొంగలించారు. వీరి నుండి కొంత కాపర్ వైర్ ను, పవర్ టిల్లర్ ను, ట్రాక్టర్ బ్యాటరీని, ఎడ్ల బండి గిరాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అడవి ముత్తారం ఎస్సై మహేందర్ కుమార్ ను సిబ్బందిని కాటారం డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాటారం సిఐ నాగార్జున రావు, సిబ్బంది పాల్గొన్నారు.