15-09-2025 07:29:10 PM
ప్రజల సంక్షేమ, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
రూ.4.29 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం/లక్ష్మీదేవిపల్లి (విజయక్రాంతి): ప్రజలకు కావాల్సిన వైద్యం, వైద్యం, రహదారులు, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి పల్లెను ప్రగతివైపు పరుగులు పెట్టిస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం, కోరుకొండ, లోతువాగు, ప్రశాంతి నగర్, శేషగిరినగర్, తెలగారమవరం పంచాయతీల పరిధిలోని పలుగ్రామాల్లో రూ.4.29 కోట్ల ఎస్ సి పి, ఎన్ఆర్ఈజిఎస్ పథకాల్లో మంజూరైన నిధులతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ భవనాలు, కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను సోమవారం అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన శంకుస్థాపన, ప్రారంభోత్సావాల సభల్లో కూనంనేని మాట్లాడారు. పల్లె రహదారులు, గ్రామాల అనుసంధాన రహదారులు, ప్రధాన రహదారుల నిర్మాణంపై ప్రత్యేక ద్రుష్టి సారించి దశలవారీగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నామన్నారు. రహదారుల సౌకర్యం మెరుగు పడితేనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని, ప్రతి గ్రామం, పంచాయతి కేంద్రాలలో హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామపంచాయతి కార్యాలయాలు, కమ్యూనిహాళ్లు, ప్రభుత్వ సేవాకేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందన్నారు.
ప్రజల నమ్మకానికి అనుగుణంగా వారి సంక్షేమం, నియోజకవర్గ అభివృధ్ధికోసం అహర్నిశలు శ్రమిస్తున్నానని, అభివృద్ధి నిధులు రాబట్టేందుకు ఏ అవకాశం వచ్చినా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం జరుగుతోందన్నారు. శంకుస్థాపనలు జరిగిన పనులు నాణ్యతా ప్రమాణాలతో పదికాలాలపాటు ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణాలు జరగాలని, అందుకు అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని, పనులను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలుసైతం పనులపై ద్రుష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, సిపిఐ మండల కార్యదర్శి దీటి లక్ష్మీపతి, నునవత్ గోవిందు, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, తూము చౌదరి, వీరబాబు, హన్మంతరావు, పీఏసీఎస్ ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్, కాంగ్రెస్ పూణెం శ్రీనివాస్, అధికారులు అంకుబాబు, శిరీష, శ్రీనివాసరావు, రామకృష్ణ, రఘురామయ్య, వెంకటస్వామి, అమ్మ సాంబయ్య, శివలాల్ తదితరులు పాల్గొన్నారు.