calender_icon.png 15 September, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వస్థ్ నారీ, సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

15-09-2025 07:35:10 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి): మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవల కోసం స్వస్థ్ నారీ, సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో స్వస్థ్ నారీ, సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లల సాధికారతే స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పీహెచ్సీల పరిధిలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అన్ని పీహెచ్సీల పరిధిలో స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ముఖ్యమైన సేవలను అందించనున్నట్లు తెలిపారు. అయితే ఇందుకోసం ముందుగా మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలో ఉన్న మహిళలకు బీపీ, షుగర్, టీబీ స్క్రీనింగ్ వంటి ప్రాథమిక పరీక్షలు చేసి వారి డేటాను తమ వద్ద ఉంచుకోవాలన్నారు.

ప్రజలు ఏ ఆరోగ్య సమస్యతో అయితే ప్రధానంగా ఇబ్బంది పడుతున్నారో గుర్తించలన్నారు. అందుకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ తమ పీహెచ్సీ క్యాంపుకి వచ్చినప్పుడు వారికి ట్రీట్మెంట్ ఇప్పించాలని సూచించారు. ఇందుకోసం శిబిరానికి వచ్చే వారికి హెల్త్ కార్డు రూపంలో ఒక కార్డు ఇవ్వాలని సూచించారు. ఏ స్పెషలిస్ట్ డాక్టర్, ఏ రోజున ఏ పీహెచ్సీ క్యాంపు సందర్శించనున్నారనే వివరాలను సమర్పించాలని వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. ఇక అన్ని పీహెచ్సీల పరిధిలో అభా కార్డు లను వేగంగా జనరేట్ చేయాలని ఆదేశించారు. ఈ స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో సామ్ చిన్నారులు తప్పనిసరిగా కవర్ కావాలని చెప్పారు. సామ్ పిల్లల వివరాలను సమర్పించాలని డి డబ్ల్యు ఓ ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు సాయినాథ్ రెడ్డి, రామచంద్రరావు, మెడికల్ ఆఫీసర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.