09-10-2025 10:51:36 AM
గ్రూపులుగా విడిపోయి దాడులకు తెగబడ్డ యువత.
వరుసగా బయట పడుతున్న సీసీ కెమెరా వీడియోలు.
పరిస్థితిని అదుపులోకి తేవాలంటూ ప్రజల విజ్ఞప్తి.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool) కేంద్రంలో ఇటీవల గ్యాంగ్ వార్స్ మళ్ళీ ఉధృతమవుతున్నాయి. యువకులు రెండు మూడు గ్రూపులుగా విడిపోయి తగిన మైకంలో పరస్పరం దాడులకు తెగబడుతున్న ఘటనలు బయటపడుతున్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా అడ్డగోలుగా పూటుగా తాగి దాడులకు తెగబడుతున్న పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రిళ్ళ వరకు బెల్టు దుకాణాలు పాన్ షాప్ వంటి అడ్డాలుగా మార్చుకొని మత్తుకు బానిసలుగా మారిన యువత రాత్రలు షికార్లు చేస్తున్నారు. భారీ శబ్దాలతో కూడిన ద్విచక్ర వాహనాలను రయ్యి మంటూ గల్లి గల్లిలో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి మరింత ఉధృతం అవుతుందని పట్టణవాసులు మండిపడుతున్నారు. ఇటీవలి దుర్గామాత ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఒక మండపం వద్ద జరిగిన గ్యాంగ్ వార్ సీసీ కెమెరాలో రికార్డ్ కాగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీంతో పాటు గతంలో బస్టాండ్ సమీపంలోని పూల దుకాణం ముందు, ఈ ఏడాది జూలై నెలలో హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని ప్రధాన రహదారిపై కూడా ఇలాంటి గ్యాంగ్ దాడులు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అయినా పోలీసు అధికారులు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంతో ఈ వరుస ఘటనలు సామాన్య ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. పరిస్థితి మరింత తీవ్రమయ్యేలోపు పోలీసులు, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఈ గ్యాంగ్ వార్స్‌ను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.