09-10-2025 10:30:44 AM
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు(Telangana local body elections notification) గురువారం నాడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికలసంఘం నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా ఏజీ న్యాయసలహా మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే ఉత్తర్వులు రాకపోవడంతో ఎన్నికల సంఘం ముందడుగు వేసింది. ముందుగా రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత ఎన్నికలకు నేడు జిల్లాల వారీగా నోటీఫికేషన్లు విడుదల కానున్నాయి. 31 జిల్లాల్లోని 53 రెవెన్యూ డివిజన్లలో 292 జడ్పీటీసీలు, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
నేటి నుంచి ఈ నెల 11 వరకు తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరించనున్నారు. రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థుల డిపాజిట్లు, నేరచరిత్ర వివరాలు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతల వివరాలను నామినేషన్లతో పాటు ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 12న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. తొలివిడత ఎన్నికలకు ఈ నెల 23న పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో విడత ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్ రానుంది. గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు ఈ నెల 17న, రెండో విడత ఎన్నికలకు ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల కానుంది.