09-10-2025 12:03:38 PM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్కార్ నడుపుతుందో, సర్కస్ నడుపుతుందో వాళ్ళకే అర్ధం కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కి బస్ భవన్ కు ప్రయాణిస్తుండగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ఉదయం హౌస్ అరెస్ట్ చేయడానికి 50 మంది పోలీసులు ఇంటికి వచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాం వెళ్ళాలి అంటే వెళ్ళండి అన్నారని చెప్పినట్లు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను, కార్పొరేటర్లను అరెస్ట్ చేసి కొంత మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొంత మందిని తిరిగి పంపించారని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవాళ "చలో బస్ భవన్" కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ పురుషులకు టికెట్ల రేట్లు డబుల్ చేయడం, బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదా? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.