09-10-2025 10:25:21 AM
వాషింగ్టన్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో(Israel-Hamas war) కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి ప్రణాళికలో తొలిదశ ఒప్పందానికి ఇజ్రాయెల్-హమాస్ అంగీకరించాయి. ఇరువర్గాలు ఒప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వెల్లడించారు. శాంతి ప్రణాళికలో భాగంగా ఒప్పందంపై ఇజ్రాయెల్-హమాస్ సంతకం చేశాయని చెప్పారు. యుద్ధ విరామం, బందీల విడుదలకు మార్గం సుగమం చేస్తుందని ట్రంత్ పేర్కొన్నారు. బందీలందరూ త్వరలోనే విడుదలవుతారని ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుదని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్ పాలనపై ఇంకా స్పష్టత రాలేదు. ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ధ్రువీకరించారు.
దేవుని దయతో బందీలను వెనక్కి తీసుకొస్తామని నెతన్యాహు ప్రకటించారు. యుద్ధం ముగియడానికి ఒప్పందం దోహదం చేస్తుందని హమాస్(Hamas) ప్రకటించింది. ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడుతాయని హమాస్ విశ్వాసం వ్యక్తం చేసింది. గాజాలోకి అంతర్జాతీయ సాయం వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని హమాస్ తెలిపింది. పాలస్తీనా యుద్ధ ఖైదీల విడుదలకు ఒప్పందం దోహదపడుతోందని హమాస్ స్పష్టం చేసింది. హమాస్ వారాంతంలో 20 మంది బందీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గాజాలోని మెజార్టీ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ బలగాలు(Israeli forces) వీడనున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ట్రంప్ తొలి విడత శాంతి ప్రణాళిక ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతాసాయం ఆశిస్తున్నామని సూచించారు. ఒప్పందం.. శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.