భౌగోళిక తెలంగాణనే ఏర్పడింది
కోట్లాడి తెచ్చుకొన్న స్వరాష్ట్ర పదేళ్ల పాలనలో కేవలం భౌగోళిక తెలంగాణనే ఏర్పడింది. సామాజిక తెలంగాణగా రూపుదిద్దుకోలేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరుబాట పట్టిన బిడ్డలకు ఉద్యమ ఆకాంక్షలు ఇంకా నేరవేరక పోవడం బాధాకరం. పాల కులు అభివృద్ధిపై ఊదరగొట్టినా.. ప్రకటనలు ఆచరణలో పెట్టకపోవడం విచారకరం. గత పాలకుల వైఫల్యాలను గుర్తెరిగి ప్రస్తుత పాలకులు ప్రధానంగా తెలంగాణలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై దృష్టి సారించాలి. అప్పుడే సబ్బండ వర్ణాల ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడుతాయి. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలు కేవలం అర్హులకే అందేలా చూడాలి. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చేలా అభివృద్ధి పాలసీలను రూపొందించి శభాష్ తెలంగాణ అనిపించుకోవాలి.
పంబ వెంకటస్వామి,
ప్రధాన కార్యదర్శి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్,
రంగారెడ్డి జిల్లా
ఉద్యమకారులు కోరిన గుణాత్మక మార్పు రాలేదు
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని సైతం లెక్కచేయకుండా స్వరాష్ట్ర ఆకాంక్షనే అంతిమ లక్ష్యంగా ఉద్యోగులు పోరుబాట పట్టారు. లాఠీ దెబ్బలకు కేసులకు జంకలేదు. స్వరాష్ట్రం వస్తే స్వపరిపాలనతో పాటు ఆత్మగౌరవం, ఉద్యోగం, ఉపాధి దొరుకుతుందని బిడ్డలంతా భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. కాని నాటి ఉద్యమ కారులు కోరిన గుణాత్మక మార్పు పదేళ్ల పాలనలో మార్పురాలేదు. ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి, ఉద్యమ నేతలను పాతలంలోకి అణగదొక్కారు. ప్రొఫెసర్ జయశంకర్‌సార్, కొదండరాంసార్ వరకు సైదాద్ధింతిక ధృక్కోణంలో సబ్బండ వర్గాల అభ్యున్నతిని కోరినం. అయితే దానికి భిన్నమైన రీతిలో నిధులు, నీళ్లు నియామకాల నినాదం దారితప్పింది. ఇప్పటికైనా ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలి.
కళ్యాణ్‌కార్ గోపాల్ జీ,
తెలంగాణ ఉద్యమ నేత,
కవి, రచయిత, రంగారెడ్డి జిల్లా
పాలకులు నటిస్తున్నారు
నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షాను నెరవేర్చడంలో స్వరాష్ట్రంలోనూ పాలకులు నటిస్తుండ్రు. నిధులు, నియామకాల సంగతి పక్కానపెడితే ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులకు మేలు జరిగిన బాధితులకు న్యాయం జరుగలే. 1969 ఉద్యమంలో జరిగిన ప్రాణ, మాణ నష్టంతో పోలిస్తే మలిదశ తెలంగాణ ఉద్యమంలో తక్కువే జరిగింది. సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సహకారంతో 2009 డిసెంబర్ 24న దీక్ష శిబిరం ప్రారంభించారు. స్వరాష్ట్రం సాధించినప్పుడు నా జన్మధన్యామైంది అనుకున్నా. 1531 రోజులు దీక్ష కొనసాగింది. ఉద్యమానికి పురుడు పోసిన చోటనే ప్రజలకు న్యాయం జరగకపోవడం చాలా బాధకరం.
వంగ గాలిరెడ్డి,
తెలంగాణ ఉద్యమకారుడు,
సిద్దిపేట దీక్ష శిబిరం నిర్వాహకుడు
ప్రత్యేక రాష్ట్రంలోనూ వివక్షకు గురవుతున్నాం
తెలంగాణ సాధన కోసం అన్నింటికి తెగించి పోరాటం చేశాం. ఎన్నోకష్ట నష్టాలు ఎదుర్కొన్నాం. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సంతోషం. కాని ఈ పది ఏండ్లలో మేము ఆశించిన విధంగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రంలోనూ వివక్షకు గురవుతున్నాం. ప్రధానంగా దక్షిణ తెలంగాణ ప్రాంతం, అందులో పూర్వపు పశ్చిమ రంగారెడ్డి జిల్లా ప్రాంతం వివక్షకు గురైంది. ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతానికి రాలేదు. ఉద్యమకారులకు కనీస గౌరవం దక్కలేదు. ప్రస్తుత ప్రభుత్వమైనా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధికి నోచుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. ఈ ఉద్యమకారులకు కనీస గౌరవం కల్పిస్తుందని ఆశిస్తున్నాం.
కె. శ్రీనివాస్, దక్షిణ రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్
ప్రజాస్వామ్య విలువలకు పాతర
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజు ఉద్యమ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, వంటావార్పు కార్యక్రమాల్లో నిబద్ధతతో పాల్గొన్నాం. నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం సమసిపోతుందని ఆశపడ్డాం. కానీ పదేళ్ల కాలంలో ఆ ఆశలన్నీ మట్టిలో కలిసిపోయాయి. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యమకారులను గత పాలకులు దూరం పెట్టారు. తెలంగాణ జాతిపిత స్వర్గీయ జయశంకర్ సార్ ఆశయాలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా.
గుండం మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం
నాయకుల్లో స్వార్థం కనిపించింది
ఈ పది ఏండ్లలో నీళ్ల ఆశ నీరుగారింది. నియామకాల ఊసెత్తలేదు. నిధుల వరద ఒక ప్రాంతానికే పరిమితం కావడం ఉద్యమకారులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రత్యేక రాష్టం ఏర్పడితే నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయనుకున్నాం. కాని అలా జరగలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నాయకుల్లో పూర్తిగా స్వార్థం కనిపించింది. దేనికోసమైతే ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడామో అదే దక్కలేదు. ఉత్తర తెలంగాణలో అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. కాని దక్షణ తెలంగాణలో ఏ ఒక్క జిల్లా కేంద్రం అభివృద్ధి జగలేదు. ఈ పది ఏండ్లలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం చేయకూడదని కోరుకుంటున్నాం.
చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్,
జేఏసీ జిల్లా ప్రధాన సలహాదారుడు
కేసులకు భయపడలేదు..
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వేగవంతం చేయడానికి మెదక్ నుంచి సంగారెడ్డికి బదిలీ అయ్యాను. అప్పట్లో నాపై 29 కేసులు నమోదు చేసినా భయపడలేదు. ఎదురించి పోరాడిన అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. కానీ, ఉద్యమ లక్ష్యం పూర్తి స్థాయిలో సాకారం కాలేదు. సబ్బండ వర్గాల అభ్యున్నతిని పాలకులు మరిచిపోయా రు. రాజకీయ పార్టీలన్నీ ప్రజలను మోసం చేస్తూ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నా యి తప్ప న్యాయం చేయడం లేదు. నియామకాలలో ఇప్పటికీ తెలంగాణ ఉద్యోగులకు చేదు అనుభవమే. ఇంకా ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం కొనసాగుతోంది. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు అందాల్సిన హక్కులను పూర్తిస్థాయిలో నెరవేర్చాలి.
మేడిశెట్టి శ్యాంరావు, ఉద్యోగుల జేఏసీ
తెలంగాణను అప్పులపాలు చేశారు
నేను న్యాయవాదిగా ఉంటూ తెలంగాణ సాధనలో పాలుపంచుకోవడం ఆనందాన్ని కలిగించింది. స్వరాష్ట్ర సాధన లక్ష్యం మాత్రం నీరుగారిపోయింది. పదేళ్లలో స్వరాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఉద్యమ సమయంలో గ్రామగ్రామాన తిరుగుతూ ఉద్యమం వైపు ఉత్తేజపరిచా. తెలంగాణ అవేర్‌నెస్ కమిటీ సభ్యుడిగా ఉంటూ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. మిలీయన్ మార్చ్ సమయంలో న్యాయవాదులను పోలీసులు కట్టడి చేస్తే వారి నుంచి తప్పించుకొని మార్చ్‌లో పాల్గొన్నాం. గత పాలకుల స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఉద్యమ లక్ష్యం నెరవేరలేదు. కొత్త సర్కార్‌కు ప్రజలు అవకాశం కల్పించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు, హక్కులను ప్రస్తుత పాలకులైనా నెరవేర్చాలి.
ఎం బాలయ్య, తెలంగాణ అవేర్‌నెస్ కమిటీ సభ్యుడు, మెదక్






