calender_icon.png 13 November, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీరు త్వరగా కోలుకోవాలి

13-11-2025 12:39:05 AM

-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

-ఢిల్లీ పేలుళ్ల ఘటనలో బాధితులకు పరామర్శ

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఢిల్లీ పేలుడు బాధితులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పరామర్శించారు. రెండు రోజు ల భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధానమంత్రి వెంటనే లోక్‌నాయక్ జయప్రకాష్(ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రికి వెళ్లి క్షత గాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధితులతో నేరుగా మాట్లాడి త్వరగా కోలుకోవాలని అభిలషించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఒక్కొక్కరిని కలిసి మాట్లాడారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ బాధితులకు హామీ ఇచ్చారు.

అలాగే అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడి బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించిన దృశ్యాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘దాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతాం’ అని హామీ ఇచ్చారు. కాగా బాంబు దాడి కుట్రదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని భూటాన్ పర్యటన సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్రమోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. కేంద్ర సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని, దాడికి కారణాలను అధికారులు త్వరలో వెల్లడిస్తారని తెలిపారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.