గేయం రెడీ లోగో పెండింగ్
జూన్ 2న ‘జయ జయహే’ జాతికి అంకితం
రాష్ట్ర గేయంగా ఆమోదించిన ప్రభుత్వం
సిద్ధమైన అందెశ్రీ గేయం
2:౩౦ నిమిషాల నిడివితో సంక్షిప్త రూపం
1౩.౩౦ నిమిషాలతో పూర్తి గేయం
జూన్ 2న ఆవిర్భావ వేడుకల్లో ఆవిష్కరణ
ఇంకా సిద్ధంకాని రాష్ట్ర అధికారిక చిహ్నం
తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెండింగ్
అసెంబ్లీలో చర్చించి వాటికి తుది రూపు
వేడుకలపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 2న ఉదయం, సాయంత్రం వేడుకలు
పరేడ్‌గ్రౌండ్ వేడుకలకు సోనియాగాంధీ
మాజీ సీఎం కేసీఆర్‌కూ ఆహ్వానం
ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో తెలంగాణ గేయాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ గేయానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇటీవలే బాణీలు సమకూర్చారు. అయితే, తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు చేసి కొత్త చిహ్నాన్ని కూడా ఈ వేడుకల్లోనే ఆవిష్కరించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ పలు కారణాల వల్ల అది వాయిదా పడింది. తెలంగాణ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణ కూడా వాయిదా పడిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వేడుకల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆయన గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ ౨వ తేదీన దేశం మొత్తం తెలంగాణవైపు చూడాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేడుకలు జరిగే సికింద్రా బాద్‌లోని పరేడ్‌గ్రౌండ్, ట్యాంక్‌బండ్‌పై అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనులు చేస్తూ వేదికలకు సొబగులు అద్దుతున్నాయి.
ఈ ఏడాదితో తెలంగాణ ఏర్పడి పదేండ్లు పూర్తవటంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారంలోకి రావటంతో ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నది. వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి ఆమెను ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా వేడుకలకు ఆహ్వానించారు. వేడుకల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
గేయానికి ఆమోదం
‘జయ జయహే తెలంగాణ’ను తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రభుత్వం ఆమో దించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ వేడుకల్లోనే రాష్ట్ర గేయాన్ని జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించి తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్య త్తులో తరతరాలు పాడుకునేలా రూపొందించినట్టు తెలిపారు. అందెశ్రీ ౨౦ ఏండ్ల కింద రాసిన ఈ గీతాన్ని యధాతధంగా ఆమోదించినట్టు ప్రకటించారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చారని వెల్లడించారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రెండు వర్షన్లలో రూపొందించారు. 2. 30 నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వెర్షన్‌ను తయారుచేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా మూడు చరణాలతో సంక్షిప్త గేయం ఉంటుందని సీఎం తెలిపారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం ‘టీఎస్’ను ‘టీజీ’గా మార్చినట్టు వెల్లడించారు.
అధికార చిహ్నం ఖరారు కాలేదు
క్యాబినెట్ నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలనే నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్టు తెలిపారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఖరారు కాలేదని చెప్పారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలను తయారు చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలపై అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావులేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసు కుంటామని ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ.
ఉదయం పరేడ్‌గ్రౌండ్.. సాయంత్రం ట్యాంక్‌బండ్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్ ౨న రోజంతా నిర్వహిస్తామని సీఎం తెలిపారు. ఉదయం పరేడ్‌గ్రౌండ్‌లో కార్యక్రమం ఉంటుందని, సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమీక్షా సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సోషల్‌మీడియాలో కొత్త లోగో
తెలంగాణ కొత్త చిహ్నం (లోగో) ఇదేనంటూ ఓ లోగో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. రాజముద్ర దాదాపుగా ఖరారైందని, అది ఇదేనంటూ కొందరు ఓ లోగోను షేర్ చేస్తున్నారు. అందులో పైన నాలుగు సింహాల గుర్తు, దానికింద అమర వీరుల స్థూపం, దానికి రెండు వైపులా వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా వరి కంకులు ఉన్నాయి. లోగో చుట్టూ తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉన్నది.
ఈ లోగో ఖరారైపోయిందని, జూన్ 2న ఆవిష్కరిస్తారని ప్రచారం జరిగింది. అయితే, చిహ్నం ఇంకా ఖరారు కాలేదని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించటంతో షోషల్‌మీడియాలో షేర్ అవుతు న్నది అసలైనది కాదని తేలిపోయింది. ప్రస్తుత లోగోలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపు ప్రతిపాదనపై బీఆర్‌ఎస్, ఇతర ప్రజాసంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.
కేసీఆర్‌కు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు రావాలంటూ మాజీ ముఖ్య మంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వా నించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఇప్పటికే ఆహ్వానించగా, ఆమె వస్తానని తెలిపారు. తాజాగా గురువారం కేసీఆర్‌కు సీఎం లేఖ రాశారు. ఈ లేఖతోపాటు ఆహ్వాన పత్రాన్ని ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ ద్వారా కేసీఆర్‌కు పంపించారు.
ఉత్సవాల షెడ్యూల్ ఇదీ..
n జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పిస్తారు.
n ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడే పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి.
n తెలంగాణ రాష్ట్ర అధికార గేయాన్ని ఆవిష్కరిస్తారు.
n అనంతరం సోనియాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు.
n పోలీస్ సిబ్బందికి, ఉత్తమ కంటింజెంట్లకు అవార్డుల ప్రదానం ఉంటుంది. అవార్డుల గ్రహీతలతో ఫొటో సెషన్‌తో ఉదయం కార్యక్రమం ముగుస్తుంది.
n సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకలు ప్రారంభమవుతాయి.
n రాష్ట్రానికి చెందిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు
n సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్ ట్యాంక్‌బండ్‌కు చేరుకొని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు.
n అనంతరం ౭౦౦ మంది తెలంగాణ కళారూపాల ప్రదర్శనతో కార్నివాల్ ఉంటుంది.
n ఆ తర్వాత 70 నిమిషాలపాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
n స్టేజ్ షో అనంతరం ట్యాంక్‌బండ్‌పై 5 వేలమందితో జాతీయ జెండాలతో భారీ ఫ్లాగ్‌వాక్ ఉంటుంది.
n ఫ్లాగ్‌వాక్ సమయంలో జయ జయహే తెలంగాణ పూర్తి గేయాన్ని (13.30 నిమిషాలు) ఆవిష్కరిస్తారు.
n అదే వేదికపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సన్మానిస్తారు.
n రాత్రి 8.50 గంటలకు 10 నిమిషాల పాటు హుసేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్ వర్క్స్) కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.






