ఇందూరులో పౌరసరఫరాలశాఖ అధికారుల మాయాజాలం ఇద్దరి సస్పెన్షన్
72.55 కోట్ల ధాన్యం మాయం జాడలేని 37 వేల టన్నుల ధాన్యం
డీఎస్‌వో చంద్రప్రకాశ్, మేనేజర్ జగదీష్‌కుమార్ సస్పెండ్
మిల్లర్లకు ధాన్యం బదలాయింపులో నిర్లక్ష్యం
అర్హతలేని మిల్లర్లకు ధాన్యం అప్పగింత
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం
విచారణ చేసి బాధ్యులను సస్పెండ్ చేసిన కమిషనర్
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 37,019.914 టన్నుల ధాన్యం కనపడకుండా పోయింది. దీని విలువ అక్షరాలా రూ.72.559 కోట్లు. నిజామాబాద్ జిల్లాలో కొందరు మిల్లర్లు చేసిన మాయాజాలం ఇది. దీనికి ఇతోధికంగా తోడ్పడింది పౌరసరఫరాల శాఖ అధికారులు. ఈ మాయాజాలానికి సంబంధిం చిన సమాచారం పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్దకు చేరడంతో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
దాంతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చి ఆగమేఘాలపై ధాన్యం ఎలా మాయమైందన్న అంశంపై విచారణ చేశారు. ఈ అంశంలో ప్రమేయం ఉన్న నిజామాబాద్ డీఎస్‌వో చంద్రప్రకాష్, ఇన్‌చార్జి మేనేజర్ జగదీష్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ.. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇదీ జరిగింది..
నిజామాబాద్ జిల్లాలో 2021 ఖరీఫ్, 2021 2022 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి 370౧9.914 టన్నుల ధాన్యాన్ని బోధన్ చుట్టుపక్కల ఉన్న అమీర్ అగ్రో ఫార్మ్స్ ప్రై.లి. (తగ్గెల్లి), రహీల్ ఫుడ్స్, క్యాటరింగ్ సర్వీసెస్ (తగ్గెల్లి), రాస్ ఫుడ్స్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ (కుమ్మన్‌పల్లి), ధాన్విక్ ఆగ్రో మిల్స్ (తగ్గెల్లి), సైరస్ ఆగ్రో ఇండస్ట్రీస్ (మినార్‌పల్లి) లకు సీఎంఆర్ కోసం కేటాయించారు. అయితే వారు నిర్ణీత సమయంలో ధాన్యం మిల్లింగ్ చేయలేదు. దీంతో ఈ ధాన్యాన్ని వేరే మిల్లర్లకు కేటాయించాలని ఆ ఐదుగురు మిల్లర్లు కోరారు.
సదరు మిల్లర్ల అభ్యర్థన మేరకు జిల్లా అధికారులు ౭ ఇతర మిల్లులకు ఆ ధాన్యాన్ని బదిలీ చేస్తూ.. నిర్ణీత సమయంలోగా మిల్లింగ్ చేసి సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు. ఇక్కడే అధికారులు తెలివి చూపించారు. 7 మిల్లుల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అత్యధికంగా ధాన్యాన్ని కేటాయించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినప్పుడు ఆ ధాన్యం.. అటు మొదట కేటాయించిన ఐదు మిల్లుల్లోగానీ.. ఇటు తరువాత కేటాయించిన 7 మిల్లుల్లోగానీ కనపడలేదు.
దీనిపై అధికారులు విచారించగా మొదటి మిల్లుల నుంచి తమకు ధాన్యం రాలేదని 7 మిల్లుల యజమానులు చెప్పారు. ఈ విషయం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల మాయాజాలంపై మండిపడ్డారు. వెంటనే పూర్తిస్థాయి విచారణ చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితో జిల్లా కలెక్టర్ విచారణ చేసిన నివేదికను పౌరసరఫరాల కమిషనర్‌కు పంపించారు. ఈ నివేదికలో పొందుపర్చిన సమాచారం తెలుసుకుని అధికారులే విస్తుపోయారు.
సామర్థ్యం లేకున్నా కేటాయింపు
రెండోసారి కేటాయించిన మిల్లర్లకు సామర్థ్యం లేకున్నా భారీగా ధాన్యాన్ని కేటాయించినట్టుగా విచారణలో తేలింది. అర్కామ్ ట్రేడర్ అనే మిల్లరు సామర్థ్యం 1500 మెట్రిక్ టన్నులు కాగా.. మొత్తం 23,122.611 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లా డీఎస్‌వో, మేనేజర్ కేటాయించారు. అలాగే రాయల్ ట్రేడింగ్ కంపెనీ (హుమ్నాపూర్), ఎంఎస్‌ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ (ఎస్‌ఎన్ పురం), యూనస్ ట్రేడర్స్ (అభంగపట్నం, నవీపేట్), సార్ ట్రేడర్స్ (వర్ని), ఎఫ్‌టీఎప్ ట్రేడర్స్ (వర్ని), అబ్దుల్ హై ట్రేడర్స్ (పెగడపల్లి)తోపాటు అర్కమ్ ట్రేడర్స్‌కు ఈ ధాన్యాన్ని కేటాయించినట్టు తేలింది. ఈ మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యాన్ని కేటాయించడంలో జిల్లా పౌరసరఫరాల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడటంతో డీఎస్‌వో చంద్రప్రకాష్, మేనేజర్ జగదీష్ కుమార్‌లను సస్పెండ్ చేస్తూ.. పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.






