27-10-2025 07:24:54 PM
భారీష్ పూజ పేరుతో ఘరానా మోసం...
పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించి...
ప్రసాదంలో మత్తు పదార్థం కలిపి డబ్బుతో పరారీ...
నలుగురు నిందితులు అరెస్టు... ఒకరు పరారి
నిందితుల వివరాలు వెల్లడించిన మేడ్చల్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): అమాయకులను ఆసరాగా చేసుకొని భారీష్ పూజ చేస్తే పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించి ప్రసాదంలో మత్తు పదార్థం ఇచ్చి డబ్బుతో పారారవుతున్న ముఠాను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి నిందితుల వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఓ ముఠా గండిమైసమ్మలోని బసవరాజు అనే వ్యక్తిని భారీష్ పూజ చేస్తే పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించారు. పూజ అనంతరం ప్రసాదం తీసుకోండి అంటూ ప్రసాదంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక రూ. 25 లక్షలతో పారారయ్యారు. 21వ తేదీన బాధితుడు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు మేడ్చల్ ఏసీపీ సిహెచ్. శంకర్ రెడ్డి, మేడ్చల్ సీసీఎస్ ఏసీపీ వై. నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో దుండిగల్ సీఐ పి. సతీష్, డిఐ బాల్ రెడ్డి, మేడ్చల్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ కిరణ్ తో బృందాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 26న అరెస్టు చేశారు. నిందితుల వివరాలు బహదూర్ పురలో ఉంటున్న మహమ్మద్ ఇఫ్రాన్(44), కామారెడ్డి జిల్లాకు చెందిన గుగోలోత్ రవీందర్(40), కుత్బుల్లాపూర్ కు చెందిన కవిరా సాయిబాబా(41), ఖైరతాబాద్ కు చెందిన ఠాకూర్ మనోహర్ సింగ్(39) ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న అబ్దుల్ ఖయ్యుమ్ పారారిలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ. 8,50,000 నగదు, ఎయిర్ గన్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.