29-12-2025 09:34:14 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి మెగా సానిటేషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాగారం, పోచారం ప్రాంతాల ప్రధాన వీధులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. వీధుల శుభ్రత, చెత్త సేకరణ, డ్రెయినేజీ వ్యవస్థ నిర్వహణ తదితర అంశాలపై శానిటేషన్ అధికారులకు, సిబ్బందికి, జవాన్లకు పలు కీలక సూచనలు, సలహాలు అందించారు.
ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య పనుల ప్రాధాన్యతను వివరించి, శానిటేషన్ సిబ్బంది బాధ్యతాయుతంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. డిసెంబర్ 29వ తేదీ నుండి జనవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా సానిటేషన్ కార్యక్రమాన్ని సమన్వయంతో, సమిష్టి కృషితో విజయవంతం చేయాలని ఈసందర్భంగా ఆమె కోరారు.