calender_icon.png 29 December, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మూర్‌లో ఆకట్టుకుంటున్న సైకత శిల్పాలు

29-12-2025 09:17:20 PM

– దశావతారాలతో సైకత  శిల్పాలు ప్రదర్శనకు సిద్దం

– నేడు వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభించనున్న  అగ్గు మహరాజ్‌

– తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా సైకత శిల్పాల  ప్రదర్శన

– వీక్షకుల కోసం నెల రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శన

ఆర్మూర్‌,(విజయక్రాంతి): ఆర్మూర్‌ పట్టణంలో విష్టుమూర్తి దశావతారాలతో పాటు వినాయకుడు, అనంత పద్మనాభ స్వామి సైతక (ఇసుక) శిల్పాలు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజైన ఈ నెల 30న మంగళవారం అగ్గు మహరాజ్ చేతుల మీదుగా ప్రారంభించనున్న ఈ ప్రదర్శన నెల రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి కొనసాగనుంది. ఆర్మూర్‌ పట్టణానికి చెందిన విజయ్‌ అగర్వాల్, లావణ్య (లావణ్య టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌) సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి  సారిగా సైకత  శిల్పాల  ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు.

విజయవాడకు చెందిన వరల్డ్‌ రికార్డులు సాధించిన ఆకునూరి బాలాజి వర ప్రసాద్‌ను ప్రత్యేకంగా పిలిపించి పది రోజులుగా సైకత శిల్పాలను రూపొందిస్తున్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వీక్షించడానికి పట్టణ ప్రజలకు, విద్యార్థులకు ప్రదర్శించడానికి అందుబాటులో ఉంచారు.  విష్ణుమూర్తి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ, రాముడు, కృష్ణుడు, బలరాముడు, కల్కి  అవతారాలను వీక్షకుల కళ్లకు కట్టినట్లుగా సైకత శిల్పాలను రూపొందించి వాటికి రంగులద్ది కళాత్మకంగా తీర్చిదిద్దారు.

అరుదైన ప్రదర్శన సద్వినియోగం  చేసుకోవాలి: ఆకునూరి బాలాజి వరప్రసాద్, సాండ్‌ ఆర్టిస్ట్, విజయవాడ

తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా సైకత  శిల్పాలతో దశావతారాల ప్రదర్శన  నిర్వహిస్తున్నందన ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.  దేశ విదేశాల్లో రికార్డులు, అవార్డులు సాధించిన నేను ఆర్మూర్‌ ప్రాంతీయుల విజ్ఞప్తి మేరకు వచ్చి సైకత శిల్పాలను రూపొందించాను.

అరుదైన అవకాశం: విజయ్‌ అగర్వాల్, శిబిరం నిర్వాహకుడు, ఆర్మూర్‌

ఇసుకతో విగ్రహాలు తయారు చేసే కళ చాలా అరుదైనది. సముద్ర తీరాలకు మాత్రమే ఈ కళ పరిమితం కాకుండా జిల్లా వాసులతో పాటు ఈ ప్రాంత విద్యార్థులు అవగాహన పెంచుకోవడానికి ఈ సైకత శిల్పాల ప్రదర్శన  ఎంతగానో  ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు సృజనాత్మకత సైతం కనువిందు చేయనుంది.

ఆధ్యాత్మిక ఉట్టి పడుతుంది: లావణ్య, శిబిరం నిర్వాహకుడు, ఆర్మూర్‌

సైకత శిల్పాలను  రూపొందించడంతో పాటు దశావతారాల ప్రదర్శనతో వీక్షకుల్లో ఆధ్యాత్మిక ఉట్టి పడుతుందనే నమ్మకంతో నా సోదరుడి సహాయంతో సైకత శిల్పాలతో దశావతారాల ప్రదర్శనను ఏర్పాటు చేసాము. నామ మాత్రపు ఎంట్రీ టికెట్‌ చెల్లించి వీక్షకులు ఈ ప్రదర్శనను నెల రోజుల పాటు చూసి అలరించవచ్చును.