24-01-2026 01:09:06 PM
సింగరేణి అనేది ఒక అటానమస్ సంస్థ
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ప్రజాభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కొన్ని పిట్టకథలు వస్తున్నాయని కొట్టిపారేశారు. సింగరేణి ఉద్యోగుల మానసికస్థైర్యాన్ని దెబ్బతీసేలా కథనాలు, పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడులు అంటూ ఒక పత్రిక రాసిన విషపు కథనంపై వివాదం మొదలైందన్నారు.
కట్టుకథలు, ఊహాగానాలతో రోజుకో కథ వండివారుస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దోపిడీదారు కోసమో.. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నాయన్నారు. కొద్దిమందికి లబ్ధి చేసేందుకు సింగరేణిపై సైట్ విజిట్ అనే నిబంధన పెట్టారని ఊహించుకుని రాశారని వివరించారు. అనుకున్న వ్యక్తులకు టెండర్లు ఇచ్చేందుకు నిబంధనలు మార్చారని కథలు అల్లారని పైర్ అయ్యారు. సైట్ విజిటింగ్ అనేది తనకు మేలు జరిగేందుకే పెట్టారని రాశారని, ఒక పత్రిక కథనం ఆధారంగా మరో నేత ఒక లేఖ రాశారని చెప్పారు.
సింగరేణి సంస్థ ప్రొసీజర్స్ ప్రకారమే నిర్ణయాలు
సింగరేణి సంస్థ ప్రోసీజర్స్ ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఆరోపణలు రాగానే టెండర్ల రద్దు చేయాలని చెప్పి వెళ్లిపోయానని చెప్పారు. తర్వాత అయినా తప్పు.. గ్రహించి మార్చుకుంటారని భావించారని తెలిపారు. సింగరేణి అనేది ఒక అటానమస్ సంస్థ అన్నారు. సింగరేణి సంస్థలో ప్రతి నిర్ణయం మంత్రిమండలి వద్దకు రాదన్నారు. సైట్ విజిట్ అనే నిబంధన కోల్ ఇండియా 2018లో పెట్టిందని తెలిపారు. కోల్ ఇండియా నిబంధన ప్రకారమే సైట్ విజిట్ తప్పనిసరి అని సింగరేణి సంస్థ 2021లో పెట్టిందన్నారు.
సెంట్రల్ మైనింగ్, డిజైనింగ్ అండ్ ప్లానింగ్ అనే సంస్థ సైట్ విజిట్ అనే నిబంధన పెట్టిందన్నారు. 2018, 2021లో తాము అధికారంలో ఉన్నామా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేంద్ర ఆధీనంలోని ఎన్ఎండీసీ కూడా 2021లో బిడ్డర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలని నిబంధన పెట్టినట్లు తెలిపారు. దేశంలోని చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర సంస్థలు సైట్ విజిట్ నిబంధనలు అమలు చేస్తున్నాయని వెల్లడించారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే, హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ లోనూ ఇదే నిబంధన ఉందని వివరించారు.